సదాశివుడి లీలావిశేషం అదే!
పరమశివుడు ఆవిర్భవించిన క్షేత్రాలు ఆయన లీలావిశేషాలకి నిలయాలుగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాల్లో మెదక్ జిల్లా 'ఝరా సంగం' లోని సంగమేశ్వర క్షేత్రం ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రం అనేక విశేషాలకి .. మహిమలకి నిలయంగా దర్శనమిస్తూ వుంటుంది.
సాధారణంగా దేవతలు .. మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఆయా క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. ఇక్కడి క్షేత్రంలో బ్రహ్మదేవుడి ఆరాధనకి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు, ఆయన కోరిక మేరకు లింగరూపంగా మారిపోయి ఆయనచే నిత్య పూజలు అందుకున్నాడు. ఇక్కడి 'అమృత కుండం' అనే జలధార కూడా బ్రహ్మ సృష్టి అనే చెబుతుంటారు.
ఈ అమృత కుండానికి భక్తులు అన్నాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. సాధారణంగా విస్తరాకులో అన్నం పెట్టి ప్రవాహంలో వదిలిపెడితే, అది ప్రవాహంలో కొట్టుకుని పోతుంది. కానీ ఇక్కడ మాత్రం అన్నం విస్తరాకు ప్రవాహానికి ఎదురు వెళుతుంది. అన్నం నీటిలో కలిసిపోయిన తరువాత విస్తరాకు ప్రవాహంలో కొట్టుకు పోతుంది. ఇది ఈ క్షేత్రంలోని మహిమలలో ఒకటిగా ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది. పరమశివుడి లీలా విశేషంగా భావించి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.
బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలను కడిగిన ప్రదేశాలు వైష్ణవ క్షేత్రాలుగా ఎంతటి విశేషాన్ని సంతరించుకుని వెలుగొందుతూ ఉంటాయో, ఆయన శివలింగాలను ప్రతిష్ఠించిన ప్రదేశాలు కూడా అంతే మహిమాన్విత శైవ క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి క్షేత్రంగా సంగమేశ్వర ఆలయం తన విశిష్టతను చాటుకుంటూనే వుంది.