అదే విష్ణు పుష్కరిణి ప్రత్యేకత
విష్ణు పుష్కరిణి అనే పేరులోనే పవిత్రత దాగివుంది. అలాంటి పుష్కరిణిలోని నీటిని తలపై చల్లుకుంటే చాలు అనిపిస్తుంది. అలంటి విష్ణు పుష్కరిణి నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట క్షేత్రంలో దర్శనమిస్తుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా కొలువై భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో ఒకటిగా ఇది చెప్పబడుతోంది.
ఇక్కడి స్వామివారికి ప్రదక్షిణలు చేసి .. నిద్రచేయడం వలన వివిధ రకాల దోషాల వలన .. దుష్ట ప్రయోగాల వలన కలిగిన అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారి ఆవిర్భావకాలం నుంచే వున్నదిగా విష్ణు పుష్కరిణి కనిపిస్తుంది. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించిన అనంతరం, యాదమహర్షికి ఇచ్చిన మాట మేరకు ఆ స్వామి లక్ష్మీసమేతుడై ఇక్కడ ఆవిర్భవించాడు.
అప్పుడు ఇంద్రాది దేవతలు స్వామిని స్తుతిస్తూ ఆయన దర్శనం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు స్వామివారి పాదాలను కడుగుతాడు. అలా ఆయన స్వామి పాదాలను కడిగిన నీటితోనే ఈ పుష్కరిణి ఆవిర్భవించిందని చెబుతుంటారు. అందువల్లనే దీనిని విష్ణు పుష్కరిణిగా పిలుస్తుంటారు. అలాంటి ఈ పుష్కరిణి లోని నీటిని తలపై చల్లుకోవడం వలన సమస్త పాపాలు .. దోషాలు .. దుఃఖాలు .. భయాలు దూరమైపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.