హనుమ అనుగ్రహముంటే చాలు
స్మరణ మాత్రంచేత కరిగిపోయేవాడు ... భజించినంత మాత్రాన్నే కనికరించే స్వామిగా హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు. తనని పూజించేవారిపట్ల ఆయన ఎంతటి ప్రీతిని కలిగివుంటాడో, రాముడిని సేవించేవారిని సైతం ఆయన అంతలా అక్కున చేర్చుకుంటాడు. హనుమంతుడికి ప్రదక్షిణలు చేయడం .. సిందూరంతో అభిషేకం చేయడం .. ఆకుపూజ జరిపించడం వలన ఆయన అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది.
అయితే ఆయన ఎక్కువగా భక్తుల నుంచి కోరుకునేది భజనలనేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రాముడిని గానీ .. తనని గాని కీర్తిస్తూ చేసే భజనలు అంటే ఆయనకి మహా ఇష్టం. ఉత్సాహంతో పరవశించిపోతూ భక్తులు చేసే భజనలకి ఆయన ఎంతగానో మురిసిపోతూ ఉంటాడట. క్షణాల్లో వేరే రూపంలో అక్కడికి చేరుకొని తాను ఆ వరుసలో ఒకడిగా చేరిపోతూ ఉంటాడని అంటూ వుంటారు.
ఇలా భజనల ద్వారా హనుమంతుడి అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుంది. హనుమకి ఇష్టమైన చామంతి పూలతో పూజించి .. ఆయనకి ఇష్టమైన అప్పాలు .. అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఆయన ప్రీతిచెందుతాడు. వీలును బట్టి దగ్గరలోని ఆలయంలో .. లేదంటే ఒక్కో వారం ఒక్కొక్కరి ఇంట్లో ఈ భజన కార్యక్రమాలు పెట్టుకుంటే అప్పుడు కలిగే ఆధ్యాత్మిక పరమైన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. హనుమంతుడి ఆరాధన వలన .. అనుగ్రహం వలన దోషాలు .. దుఃఖాలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలతో కూడిన ఆనందకరమైన జీవితం లభిస్తుంది.