మహా పుణ్యాన్ని అందించే మహావిష్ణు పూజ

ఈ జన్మలో తెలిసి ఎవరికి ఎలాంటి హాని చేయలేదు .. కష్టాల్లో ఉన్నవారిని చూసి పాపం అనుకున్నామే గాని పాపాలు చేయలేదు. అలాంటి మాకు ఎందుకు స్వామి ఇన్ని కష్టాలు అని చాలామంది అనుకుంటూ వుంటారు. గత జన్మలలో చేసిన పాపాలు .. మహా పాతకాల ఫలితాన్నే తాము ఇప్పుడు అనుభవిస్తున్నామనే విషయం చాలా తక్కువ మంది గ్రహింపునకు వస్తుంది. పాపాల ఫలితాల నుంచి బయటపడాలంటే పుణ్యరాశిని పెంచుకోవాలి.

ఎన్నో క్షేత్రాలను దర్శించడం వలన .. మరెన్నో దానధర్మాలు చేయడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. అంతటి అవకాశం .. ఆర్ధిక స్తోమత లేనివారికి ఏకాదశి వ్రతానికి మించిన మార్గం లేదు. ఏడాదిలో పలకరించే 24 ఏకాదశులలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత వుంది. అలా జ్యేష్ఠ బహుళ ఏకాదశి కూడా ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని అంటారు.

వామనావతారం ధరించిన శ్రీమహావిష్ణువును ఈ రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవారు మహా పాతకాల నుంచి కూడా విముక్తిని పొందుతారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పాపాలు తొలగిపోవడమే కాకుండా .. పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పుణ్య క్షేత్రాలను దర్శించి .. సువర్ణ దానం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News