కబీరు గొప్పతనం అదే!
రామనామ సంకీర్తనచేస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహాభక్తులలో కబీరు ఒకరు. ప్రజలలో భక్తి భావాలను పెంపొందింపజేస్తూ, ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురావడానికి ఆయన తనవంతు కృషి చేశాడు. ఈ విషయంగా ఆనాటి సమాజంలోని స్థితిగతులు ఆయనని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా, తాను అడుగుపెట్టిన భక్తిమార్గాన్ని విడిచిపెట్టలేదు. భగవంతుడి అనుగ్రహంతో తాను అనేక ప్రమాదాల నుంచి బయటపడటమే కాదు, ఆయన కరుణతో తాను కూడా ఎంతోమందిని రక్షించాడు. అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తూ వుంటాయి.
ఒకసారి కబీరు తన చేతిలోని నీరును ధారగా కిందికి వదులుతున్నాడట. ఆయన ఎంతో శ్రద్ధగా ఆ పని చేస్తుండటం చూసినవాళ్లు, అందుకు కారణమేమిటని అడుగుతారు. పూరీలో ఒక భక్తుడికి మంటలు అంటుకున్నాయనీ, భగవంతుడి సేవకుడిగా అతణ్ణి కాపాడటం తన ధర్మమని చెబుతాడు కబీరు. ఆ సమయంలో అక్కడున్న భక్తులు కొందరు ఆసక్తి కొద్దీ ఆరా తీస్తారు. కబీరు చెప్పిన రోజున నిజంగానే ఒక భక్తుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడనీ, అయితే ఎవరో పైనుంచి నీళ్లు కుమ్మరించినట్టుగా ఆయన శరీరమంతా తడిసిపోయి మంటలు ఆరిపోయాయని అక్కడి వాళ్లు చెబుతారు. దాంతో మహా భక్తుడిగా కబీరు యొక్క గొప్పతనం మరోమారు వెలుగులోకి వస్తుంది.