సంకటహర చతుర్థి

జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతూ వుంటాయి. అనుకోని అవాంతరాలు మీద పడుతూ వుంటాయి. ఊహించని సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. తలపెట్టిన కార్యాలు అడుగైనా కదలక అసహనాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి తెలికైనా మార్గం .. ప్రతి నెలలోను బహుళ చవితి రోజున వచ్చే అవకాశంగా 'సంకటహర చతుర్థి' కనిపిస్తూ వుంటుంది. ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించవలసి వుంటుంది.

అనునిత్యం వినాయకుడిని పూజించేవాళ్లు .. అంకితభావంతో సేవించేవాళ్లు ఎక్కువగా వుంటారు. దగ్గరలో ఆయన ఆలయం వుంటే దర్శించుకోకుండా ఎక్కడికీ వెళ్లరు. సమస్యల బారి నుంచి తమని గట్టెక్కించమనీ, తాము తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చూడమని ప్రార్ధిస్తుంటారు. ఆ వినాయకుడి ఆశీస్సులను పొందుతుంటారు.

ఇక సంకటహర చతుర్థి రోజున ఆయనకి పూజాభిషేకాలు జరిపి, వినాయక చవితి రోజున మాదిరిగా వ్రతాన్ని ఆచరించినట్లయితే, ఆ స్వామి అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుందని చెప్పబడుతోంది. భక్తిశ్రద్ధలతో ఆ స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించడం వలన ఆయన ఎంతగానో సంతృప్తి చెందుతాడు. స్వామికి ప్రీతిని కలిగించడం వలన ఎంతోకాలంగా ముందుకి సాగని కార్యాలకి గల అడ్డంకులు తొలగిపోతాయి. తలపెట్టిన కార్యాలు విజయవంతం కావడంలోనే అభివృద్ధి .. ఆనందం దాగి వుంటాయి కనుక, సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించే అవకాశాన్ని మాత్రం వదులుకో కూడదు.


More Bhakti News