ఎల్లవేళలా ఆదుకునే ఎల్లమ్మతల్లి

సాధారణంగా ఎల్లమ్మతల్లి ఓ గ్రామదేవతగా వివిధ గ్రామాలలో పూజలు అందుకుంటూ వుంటుంది. కొన్ని ప్రదేశాల్లో తన మహిమలు చూపుతూ క్షేత్ర వైభవంతో వెలుగొందుతూ వుంటుంది. అలాంటి ఎల్లమ్మ తల్లి ఆవిర్భవించిన క్షేత్రంగా హైదరాబాద్ -'బల్కం పేట' ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి అమ్మవారు 'బావి' కోసం మట్టి తీస్తూ వుండగా లో వెలుగు చూసింది. అందువలన అమ్మవారి తల భాగం వెనుక నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ వుంటుంది.

ఈ కారణంగా ఆ తల్లిని 'జలదుర్గ'గా పిలుస్తూ .. కొలుస్తూ వుంటారు. నీరు జీవధారగా చెప్పబడుతోంది. అలాంటి నీటిని నిరంతరం ప్రవహింపజేస్తూ, ఆ తల్లి అందరినీ కాపాడుతూ వుంటుంది. ఎల్లమ్మతల్లీ అని ఆర్తితో పిలిస్తేచాలు .. ఎన్ని కష్టాల్లో వున్నా అవన్నీ మటుమాయమై పోతాయని ఎంతోమంది భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తనని విశ్వసించినవారి వెంట వుంటూ అమ్మవారు కాపాడుతూ ఉంటుందనడానికి ఎన్నో నిదర్శానాలు వున్నాయి.

అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశంలో నుంచి వస్తోన్న నీటిని తీర్థంగా ఇస్తుంటారు. ఈ తీర్థాన్ని స్వీకరించడం వలన అనేక పాపాలు .. దోషాలు నశిస్తాయనీ, అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. అమ్మవారు అనుగ్రహించిందనడానికి సూచనగా ఆ తల్లి స్వప్నంలో దర్శనమిస్తూ వుండటం ఇక్కడి విశేషం.


More Bhakti News