అరుణాచలంలో అడుగుపెడితే చాలు
పంచభూత లింగాలలో 'అగ్నిలింగం' ఒకటిగా చెప్పబడుతోంది. ఆదిదేవుడు అగ్ని స్వరూపంగా వెలసిన క్షేత్రంగా 'తిరువణ్ణామలై' దర్శనమిస్తుంది. దీనినే అరుణాచల క్షేత్రమని పిలుస్తుంటారు. స్వామివారు అరుణాచలేశ్వరుడిగా అమ్మవారు అభితకుచాంబగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. శ్రీకాళహస్తిలో వాయులింగం ఎదురుగా వున్న దీపారాధన స్వామివారి శ్వాస వలన రెపరెపలాడుతూ వుంటుంది. అలా వాయులింగ మహిమ చెప్పబడుతూ వుంటుంది.
ఇక అరుణాచల విషయానికి వచ్చేసరికి, ఇక్కడ స్వామి జ్యోతి స్వరూపంలో .. అగ్ని తత్త్వంతో ఆవిర్భవించాడు. అందుకు నిదర్శనంగా స్వామివారికి సమీపంగా ఎక్కువసేపు నుంచోలేనంత వేడిగా వుంటుంది. ఆ ఉక్కపోతకి క్షణాల్లోనే వళ్లంతా తడిసి ముద్దైపోతుంది. ఆ కాసేపటి దర్శన భాగ్యం చాలు పాపాలు దహించబడటానికి అనిపిస్తుంది. అంతటి వేడిని వెదజల్లే స్వామికి అభిషేకం చేసే దృశ్యాన్ని చూసితీరవలసిందే.
అలా అభిషేకం జరుగుతోన్న సమయంలో లోపలికి వెళ్లడానికి అవకాశం లేకపోతే, ఆ అభిషేకం జలం బయటికి వచ్చే చోట నుంచుని అభిషేక జలం తలపై చల్లుకోవచ్చు. ఇక ఇంతకి మించిన అదృష్టం ఇంకొకటి లేదు. అయ్యవారు దర్శనం అంత వేడి వాతావరణంలో జరిగితే, ఆ పక్కనే గల దేవాలయంలోని అభితకుచాంబ తల్లిని దర్శించుకుంటే చల్లగా అనిపిస్తుంది. అందుకేనేమో తల్లి ఆయనకి సమీపంగా కోలువైందని అనిపిస్తుంది. వినాయకుడు .. సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక ఆలయాల్లో దర్శనమిస్తూ వుంటారు. శివకుటుంబాన్ని దర్శించిన ఫలితం వలన, సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.