ఏరువాక పున్నమి
మానవాళికి అవసరమైన ఆహారాన్ని అందించేది భూమి. వ్యవసాయం ద్వారా రైతులు తమకి కావలసిన ధాన్యాన్ని భూమి నుంచే పొందుతుంటారు. కాలాన్ని బట్టి .. నీటి వసతిని బట్టి వివిధ రకాల పంటలను రైతులు పండిస్తూ వుంటారు. రైతులకి అవసరమైన ఆహారాన్నీ, ఆ ధాన్యం ద్వారా ఆదాయాన్ని అందించేది భూమినే. అలా భూమి నుంచి వచ్చే ఆహారం ద్వారానే మానవాళి తన మనుగడను సాగిస్తూ వుంటుంది.
అంతగా తమను ఆదుకుంటోన్న నేలతల్లికీ .. వ్యవసాయంలో తమకి సహకరిస్తూ వస్తోన్న ఎద్దులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతూ వుంటారు. ఇక మీదట కూడా తమని చల్లగా చూడమని కోరుతూ పూజిస్తూ వుంటారు. అలా జ్యేష్ఠ పౌర్ణమి రోజున భూమినీ .. ఎద్దులను .. నాగలిని రైతులు పూజిస్తూ వుంటారు. అందువల్లనే ఈ పౌర్ణమిని 'ఏరువాక పున్నమి'గా పిలుస్తుంటారు. నేలతల్లినీ .. ఎద్దులను .. నాగలిని పూజించి, ఆ తరువాత పొలాన్ని దున్నడం మొదలుపెడతారు. ఈ విధంగా రైతులు తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తారు .. ఆహార పంటలను అందించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తారు.