వెంకన్నకి గిరిప్రదక్షిణ చేస్తే చాలు
వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం .. పసిడి ఆభరణాలతో వెలుగొందే రూపం .. అభయ వరద హస్తాలతో అనుగ్రహించే రూపం చూస్తూ వుంటే ఆకలిదప్పులు తెలియవు. భక్తుల కోసం వైకుంఠాన్ని .. వైభవాన్ని వదులుకుని వచ్చిన స్వామిని దర్శించి సేవించడం కన్నా మహద్భాగ్యం ఏవుంటుందని అనిపిస్తుంది. అలాంటి వేంకటేశ్వరుడు 'గుట్టపల్లి'పై ఆవిర్భవించి తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తున్నాడు.
తమిళనాడు - ముల్ బాగల్ ప్రాంతానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఎత్తైన గోపురాలు .. పొడవైన ప్రాకారాలు .. పవిత్రమైన కోనేరుతో స్థలమహాత్మ్యం కలిగినదిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. పూర్వం శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం ఇక్కడి గుట్టపై 'భ్రుగుమహర్షి' తపస్సు చేశాడని అంటారు. ఆయన తపస్సుకు మెచ్చి స్వామి వేంకటేశ్వరుడుగా ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. ఆ మహర్షి కోరిక మేరకు అక్కడే కొలువుదీరతాడు.
ప్రతి శనివారంతో పాటు .. శ్రావణ మాఘమాసాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక్కడి స్వామిని భక్తులు కిటికీ ద్వారా దర్శనం చేసుకోవడం విశేషం. స్వామి స్వయంవ్యక్తమైన ఈ కొండచుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన దర్శనం చేసుకుంటే పాపాలు పటాపంచలై పోతాయి. పాపాల ఫలితాల వలన అనుభవిస్తూ వస్తోన్న దారిద్ర్యము .. దుఃఖం నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయి.