భైరవకోనలో వినిపించే కథ!
ప్రకృతి అందచందాలకు భగవంతుడుకూడా పరవశించిపోతాడు. తనకి ఇష్టమైన చోటున కొలువై సేదతీరుతుంటాడు. తనని వెతుక్కుంటూ వచ్చిన భక్తులను చూసి ముచ్చట పడుతుంటాడు. వాళ్ల కోరికలను నెరవేర్చి సంతోషపడుతుంటాడు. అలా మహాదేవుడు కొలువైన ప్రదేశమే 'భైరవకోన'. ప్రకాశం జిల్లాలోని ఈ క్షేత్రం .. సిద్ధక్షేత్రంగా .. మహిమాన్విత క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడి కొండగుహలు భగవంతుడి ఆదేశం మేరకు తొలచబడ్డాయని అంటారు.
ఇద్దరు అన్నదమ్ములు ఈ గుహలను తొలిచారనే కథలు వినిపిస్తుంటాయి. కొన్ని క్షేత్రాల్లో ఆశ్చర్యచకితులనుచేసే కొన్ని శిల్పాల రూపకల్పనలోను అన్నదమ్ముల కథలు వినిపిస్తూ వుంటాయి. అలాగే ఈ క్షేత్రంలో గల గుహలను అన్నదమ్ములు తొలిచినట్టుగా చెప్పుకుంటూ వుంటారు. తాము ఇతరుల కంట పడకుండా ఉన్నంతవరకే ఈ కొండలలో గుహలను తొలుస్తూ వెళ్లాలని ఇద్దరన్నదమ్ములు ఒక నియమాన్ని పెట్టుకున్నారట.
అలా కొన్ని గుహలను తొలిచిన తరువాత ఇతరుల కంట పడటంతో, తమ పనికి స్వస్తి పలికి ఇక్కడే వున్న ఒక సొరంగ మార్గంలోకి వెళ్లి అదృశ్యమైపోయారని చెబుతుంటారు. ఇలా ఈ క్షేత్రంలో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో వినిపిస్తుంటాయి. ఎన్నో విశేషాలు .. మరెన్నో మహిమలు కనిపిస్తుంటాయి. దేవతలు .. మహర్షులు .. సిద్ధులు తిరుగాడే ఈ పవిత్ర ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టమనిపిస్తుంది. అనిర్వచనీయమైన ఆ అనుభూతిని పది కాలాలపాటు పొందాలనిపిస్తుంది.