నిర్జల ఏకాదశి ఫలితం!

నాయనా నారాయణా అని పిలిస్తే చాలు .. అప్పటివరకూ అనుభవిస్తోన్న సమస్త వైభోగాలను పక్కన పెట్టేసి పరిగెత్తుకు రావడానికి స్వామి ఎంతమాత్రం ఆలోచించడు. లోక కల్యాణం కోసం .. భక్తులను తరింపజేయడం కోసం స్వామి అనేక అవతారాలను ధరించాడు. అనేక క్షేత్రాలలో కొలువై తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తున్నాడు. అంతే కాకుండా ప్రతిమాసం ఏకాదశి వ్రతంతో తన సేవ చేసుకుని కోరిన వరాలను పొందే భాగ్యాన్ని భక్తులకి కల్పించాడు.

ఒక్కో ఏకాదశి వ్రతం వలన ఒక్కో విశేష ఫలితం కలిగేలా భక్తకోటిని అనుగ్రహించాడు. ఆ నేపథ్యంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి .. 'నిర్జల ఏకాదశి'గా చెప్పబడుతోంది. నీళ్లు కూడా తాగకుండా ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది. అందువల్లనే దీనిని నిర్జల ఏకాదశిగా చెబుతుంటారు.

సాధారణంగా ప్రతి ఏకాదశి వ్రతం .. ఉపవాస జాగరణలతో కొనసాగుతుంది. ఈ ఏకాదశి రోజున నీరు కూడా తాగకుండా శ్రీమహా విష్ణువును సేవించవలసి వుంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించిన అనంతరం పానకం .. వడపప్పు .. పాదరక్షలు .. గొడుగు దానం చెయ్యవలసి వుంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి అనేక పుణ్య ఫలితాలను పొందినవాళ్లు ఎందరో పురాణ కాలం నుంచి వున్నారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మిగతా ఏకాదశి వ్రతాలను సైతం ఆచరించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News