లక్ష్మీనారాయణుల సేవా ఫలితం

జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలంటే ధనమనేది చాలా అవసరం. ధనమనేది ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది. దారిద్ర్యం వలన కలిగే దుఃఖం నుంచి విముక్తిని చేస్తుంది. అవసరాల నుంచి .. ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది. అందువలన ధనార్జనకి అంతా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే అది న్యాయంగా .. ధర్మంగా సంపాదించినది అయినప్పుడే మంచికార్యాలకి ఖర్చు అవుతుంది.

ఇక మంచిమార్గంలో ఎవరు ఎంత కష్టపడినా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని బట్టి ఆ ఇంటికి సంపద చేరుతూ వుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే, పవిత్రతతో బాటు శాంతం .. సహనం .. స్నేహ భావం .. సేవా భావం కలిగి వుండాలి. కఠినాత్ముల దరిదాపుల్లో ఉండటానికి కూడా అమ్మవారు ఇష్టపడదు. మంచిమనసుతో ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించేవారిని విడిచిపెట్టదు.

ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనది ఏంటంటే స్వామివారికి అలంకారాలు .. అభిషేకాలు జరుపుతూ భక్తిశ్రద్ధలతో పూజించడం. అప్పుడు ఆయన హృదయస్థానంలో వున్న లక్ష్మీదేవికి ఆ పూజలు చేరతాయి. ఇక లక్ష్మీదేవిని నేరుగా ఆరాధించిన భక్తుల పట్ల స్వామి ఎంతో ప్రీతిని కనబరుస్తుంటాడు. ఇలా ఒకరిని పూజిస్తే ఒకరు సంతోషిస్తారు .. సంతృప్తి చెందుతారు .. కలిసి సిరిసంపదలతో పాటు ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తారు. అందుకే శుక్రవారం రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తూ వుండాలి ... వారి కృపాకటాక్షాలతో తరిస్తూ వుండాలి.


More Bhakti News