భీష్మ ఏకాదశి

భీష్ముడు అనే పేరు వినగానే మహాభారతంలోని మహోన్నతమైన ఘట్టాలు కళ్లముందు కదలాడతాయి. మహాభారత యుద్ధంలో ప్రధానపాత్ర పోషించిన భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతన మహారాజు ... దాసరాజు కూతురు సత్యవతిపై మనసుపారేసుకున్నాడని తెలుసుకుని, వారి వివాహం జరిపించడానికి సిద్ధపడతాడు.

రాజ్యాధికారం శంతనుడికి ... సత్యవతికి జన్మించిన వారికే దక్కుతుందనీ, ఇందుకోసం తాను వివాహం చేసుకోనని దాసరాజు దగ్గర భీషణ ప్రతిజ్ఞ చేశాడు. చివరి వరకూ ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నందువల్లనే ఆయన భీష్ముడిగా చరిత్రలో నిలిచిపోయాడు. మరణ సమయాన్ని ఎంచుకునే వరం భీష్ముడికి వుంది. ఈ కారణంగానే మహాభారత యుద్ధంలో గాయపడి అంపశయ్యపై ఉన్న భీష్ముడు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేంత వరకూ తుది శ్వాస వదలకుండా ఎదురుచూశాడు.

మాఘమాసం ... శుక్లపక్ష అష్టమి రోజున రోహిణీ నక్షత్రం (శ్రీ కృష్ణుడి జన్మ నక్షత్రం) అభిజిత్ లగ్నాన్ని మరణానికి ముహూర్తంగా చేసుకున్నాడు. ఆ తరువాతనే ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిని రప్పించుకుని విష్ణు సహస్ర నామాలను చదువుతూ నమస్కరించి శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆయన జ్ఞాపకార్థం శ్రీ కృష్ణుడు ఒక ఏకాదశిని కేటాయించి దానికి 'భీష్మ ఏకాదశి'అనే పేరు పెట్టాడు. అప్పటి నుంచి శ్రీ కృష్ణుడి అనుగ్రహం కోసం భీష్మ ఏకాదశిన దేవాలయాల్లో విష్ణు సహస్రనామం చదవడం మొదలైంది.


More Bhakti News