పుణ్యఫలాలనిచ్చే పల్లకీసేవ
సద్గురువును పరీక్షించేవాళ్లు .. నిందించేవాళ్లు .. ద్వేషించేవాళ్లు భగవంతుడి అనుగ్రహానికి దూరమవుతారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గురువును సేవిస్తూ వెళుతుంటే, దైవానుగ్రహం నీడలా వెంటే వస్తూ ఉంటుందనే విషయాన్ని నిరూపించే ఎన్నో సంఘటనలు ఆ గ్రంధాలలో కనిపిస్తుంటాయి. తమ అజ్ఞానం తొలగిపోయి గురువును గుర్తించగలిగేవాళ్లు కొందరైతే, గురువు చల్లనిచూపు వలన ఆయన సన్నిధికి చేరువై అజ్ఞానాన్ని పోగొట్టుకునేవాళ్లు మరికొందరు.
గురువు యొక్క పాదాలకు నమస్కరించడం వలన సమస్త పుణ్యతీర్థాలకి నమస్కరించిన ఫలితం దక్కుతుంది. అందుకే గురువు పాదాలకి నమస్కరించడమనేది అనాదికాలంగా వస్తోంది. గురువు అందుబాటులో లేనప్పుడు ఆయన పాదుకలకి నమస్కరించడం వలన కూడా అంతే ఫలితం కలుగుతుందని చెప్పడానికి అనేక నిదర్శనాలు వున్నాయి. శిరిడీ సాయినాథుడికి మొదటిసారిగా పల్లకీ సేవని నిర్వహిస్తామని చెప్పినప్పుడు, తాను పల్లకీ ఎక్కకుండా అందులో తన పాదుకలను ఉంచమని చెప్పడంలోని భావం ఇదే.
ఈ కారణంగానే నేడు బాబా ఆలయాల్లో ప్రతి గురువారం ఆయన పాదుకలను పల్లకీలో వుంచి ఊరేగింపును జరుపుతుంటారు. ఆ పాదుకలు కలిగిన పల్లకీని మోయడం వలన ప్రత్యక్షంగా ఆయన సేవ చేసిన ఫలితం లభిస్తుంది. బాబా పాదుకలను మోయడం వలన .. తమ బరువు బాధ్యతలను మోయడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను ఆయన ప్రసాదిస్తుంటాడని భక్తులు భావిస్తుంటారు. తాము మోసే పల్లకీలోనే బాబా తమకి ఇవ్వవలసిన పుణ్య ఫలాలను వుంచుతాడని విశ్వసిస్తుంటారు.