కష్టాలు తొలగించే కపాలీశ్వరుడు

పరమశివుడి లీలావిశేషాలు చెప్పుకుంటేచాలు పుణ్యరాశి పెరిగిపోతుంది .. మహా పాపాలు సైతం మైనంలా కరిగిపోతాయి. ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ... ఆయన లీలావిశేషాలకు నిలయాలుగా వెలుగొందుతూ వుంటాయి. ఆయన కొలువైన ప్రతి క్షేత్రం వెనుక పురాణపరమైన కథనం దాగి వుంటుంది. ఆలాంటి ఆసక్తికరమైన కథనం చెన్నై - మైలాపూర్లో వినిపిస్తుంది.

పార్వతీదేవి నెమలి రూపంలో పరమశివుడిని గురించి తపస్సు చేసిన ప్రదేశం కావడం వలన, ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందనేది స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది. ఇక్కడి సదాశివుడిని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు శివనింద చేస్తాడు. ఆగ్రహించిన ఆదిదేవుడు ఆయన అయిదు తలల్లో తనని నింద చేసిన తలని తీసేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడు.

తొందరపాటుతో శివ నిందచేసి తాను ఎంతటి పాపానికి పాల్పడినది గ్రహించిన బ్రహ్మదేవుడు, ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించి .. ఆ పాపం నుంచి విముక్తిని పొందాడు. అందువల్లనే ఇక్కడి శంకరుడు 'కపాలీశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. దేవతలు .. మహర్షులు తిరుగాడిన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన, పాపాలు .. శాపాలు .. దోషాలు .. కష్టాలు తీరిపోయి, సుఖశాంతులు లభిస్తాయని చెప్పబడుతోంది. ఒక వైపున పురాణ పరమైన నేపథ్యాన్ని సంతరించుకుని, మరోవైపున చారిత్రక వైభవాన్ని ఆవిష్కరించే ఈ క్షేత్ర దర్శనం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మళ్లీ పుట్టనవసరం లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది.


More Bhakti News