రంభా తృతీయ ప్రత్యేకత అదే!
స్త్రీ తన జీవితంలో వివాహ యోగానికీ .. సౌభాగ్యానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. వాటి కోసమే ఎన్నో పూజలు చేస్తుంది ... పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక గ్రంధాల ఆధారంగా నోములు .. వ్రతాలను ఆచరిస్తుంది. సాధారణంగా ఈ వ్రతాలలో ఎక్కువగా పార్వతీదేవి ఆరాధనతో .. అనుగ్రహంతో ముడిపడినవిగా కనిపిస్తాయి. అలాంటిది సాక్షాత్తు పార్వతీదేవియే చేసిన వ్రతంగా 'రంభావ్రతం' చెప్పబడుతోంది.
రంభావ్రతం అంటే .. అరటిచెట్టు రూపంలో వున్న సావిత్రీదేవిని పూజించడం. జ్యేష్టమాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసం కాగా, జ్యేష్ట శుద్ధ తదియ రోజున సావిత్రీదేవి పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అందువలన ఈ రోజున ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ వుంటారు. అరటి చెట్టుకింద సావిత్రీదేవిని పూజించి .. దంపతులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వవలసి వుంటుంది.
పార్వతీదేవి .. పరమశివుడి మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకుంది. ఆయనని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తన మనసులోని కోరిక నెరవేరడానికి మార్గమేవిటో సెలవీయవలసిందిగా ఆమె భ్రుగుమహర్షిని కోరుతుంది. రంభావ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆయన సెలవీయడంతో, అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరించి, స్వామివారిని భర్తగా పొందింది. అందువలన యువతులు ఈ వ్రతాన్ని అంకితభావంతో ఆచరించడం వలన వివాహయోగం కలగడమే కాకుండా .. కలకాలం సౌభాగ్యంతో సంతోషమయ జీవితాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేయబడుతోంది.