వరాల నిలయమే ఈ క్షేత్రం!

పరమశివుడి లీలావిశేషాలు అనంతాలు .. ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు అనేక విశేషాలకు ఆనవాళ్లు. కొండలమీద .. బండలమీద .. అడవుల్లోను ..గుహల్లోను .. సొరంగ మార్గాల్లోను ఇలా ఒకటేమిటి .. తన భక్తులకి అందుబాటులో ఉండటం కోసం ఆ దేవదేవుడు ఎన్నో ప్రదేశాల్లో కొలువుదీరాడు. దర్శనమాత్రం చేతనే దయ చూపెడుతూ ధన్యులను చేస్తున్నాడు. అలా స్వామివారి అనుగ్రహాన్ని దోసిట్లో పెట్టే క్షేత్రంగా 'నాగలింగేశ్వర ఆలయం' కనిపిస్తుంది.

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పరిధిలో గల పెద్దగుడిబండలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి పర్వదినాన సూర్యభగవానుడి కిరణాలు ఇక్కడి శివలింగంపై పడటం ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా కనిపించే ప్రధానమైన మహిమగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. హరహర మహాదేవ అంటూ భక్తులు తరించిపోతూ ఈ దృశ్యాన్ని వీక్షిస్తారు. ఇక్కడే చెన్నకేశవ ఆలయం కూడా వుంది. అందువలన ఇది శివకేశవ క్షేత్రంగా అలరారుతోంది.

విశేషమైన పర్వదినాల్లో ఇటు శివుడికీ .. అటు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు .. విశేషమైన సేవలను నిర్వహిస్తుంటారు. ఇక్కడ చెన్నకేశవుడు వెన్నవంటి హృదయమున్నవాడిగా అనిపిస్తే, శివుడు మంచువంటి మనసున్నవాడిగా కనిపిస్తాడు. ఇద్దరూ పోటీలుపడి భక్తుల కోరికలను నెరవేరుస్తూ వుంటారు కాబట్టి, ఇది వరాల నిలయంగా అలరారుతోంది. చెన్నకేశవుడిని దర్శించుకోవడం వలన దుర్గతులు నశించి విజయం లభిస్తుందని చెబుతారు. శివయ్యను పూజించడం వలన పాపాలు తొలగిపోయి మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని అంటారు.


More Bhakti News