భగవంతుడి అనుగ్రహం అలాంటిది
శ్రీనివాసుడు ఎంతో కరుణామయుడు .. మరెంతో దయామయుడు. గోరంతసేవ చేసుకుంటే చాలు .. కొండంత పుణ్యఫలాలను ఆప్యాయంగా అందిస్తాడు. తనని పూజించే భక్తులనే కాదు .. ఆ భక్తుడి కుటుంబీకులను సైతం తరతరాలుగా కాపాడుతూ వస్తుంటాడు. అంతేకాదు తన సేవలో పాల్గొనే విశిష్టమైన స్థానాన్ని వాళ్లకి ప్రసాదిస్తుంటాడు.
తిరుమల విషయానికే వస్తే .. అన్నమయ్య వంశీకులను .. వెంగమాంబ వంశీకులను .. కురువ నంబి వంశీకులను .. స్వామి పుట్టలో వున్నప్పుడు అక్కడికి వచ్చే గోవుని కాసిన గొల్ల వ్యక్తి వంశీకులను అనుగ్రహించాడు. ఆ భక్తుల కుటుంబాలు తరతరాల పాటు తన సేవలో తరించే భాగ్యాన్ని కలిగించాడు.
అక్కడి నుంచి విహారార్థం వచ్చినట్టుగా చెబుతోన్న 'అమ్మా పూర్'లోని వేంకటేశ్వరుడు ఇక్కడ కూడా అదే రీతిలో భక్తులను కటాక్షించాడు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి శ్రీనివాసుడిని భక్తులు 'కురుమూర్తిస్వామి' గా పిలుచుకుంటూ వుంటారు. తమ ఇలవేల్పుగా భావించి కొలుస్తుంటారు.
ఇక్కడస్వామివారు ఆవిర్భవించే సమయంలో కొంతమంది భక్తులు ఆయన మనసు దోచుకున్నారు. అందువలన ఆ కుటుంబీకుల నుంచే నేటికీ కొన్ని సేవలను స్వామి స్వీకరిస్తూ వుంటాడు. స్వామివారి సేవల్లో ఆ భక్తుల వంశస్తులు తప్పనిసరిగా పాల్గొంటూ వుంటారు. అలాంటి అవకాశం లభించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు.