అదే నరసింహుడి మహిమ!

ప్రహ్లాదుడికి గల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం .. లోకంలో సుఖశాంతులు వర్ధిల్లడం కోసం నరసింహస్వామి ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడి సంహారం జరిగిన అనంతరం ఆయన అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. దేవతలు .. మహర్షులచే పూజలందుకున్న స్వామి కొన్నిచోట్ల అంతర్హితమైపోయాడు. ఆ తరువాత కాలంలో సమయం ఆసన్నమైనదని అనుకున్నప్పుడు ఆయన వెలుగులోకి వచ్చాడు.

అలా ఆయన వెలుగులోకి వచ్చిన తీరు ఒక్కోచోట ఒక్కోవిశేషంగా కనిపిస్తూ వుంటుంది. అర్చామూర్తిగా స్వామివారు చూపిన మొదటి మహిమగా అది చెప్పబడుతూ వుంటుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రంగా 'మామిళ్ల పల్లి' కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం, నరసింహస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది.

పూర్వం ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా ఉండేవట. అందువల్లనే ఈ ఊరికి మామిళ్లపల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఒక మామిడి తోటలో నుంచి స్వామివారి విగ్రహం బయటపడిందట. తనని పూజించి పునీతులు కావలసిందిగా అక్కడి భక్తులకు స్వప్నంలో కనిపించి మరీ చెప్పాడట. దాంతో అంతా కలిసి స్వామివారి మూర్తిని ప్రతిష్ఠింపజేసుకుని పూజించడం ప్రారంభించారు.

ఇక్కడి స్వామివారు శాంతమూర్తిగా దర్శనమిస్తూ వుంటాడనీ, కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటాడని భక్తులు చెబుతుంటారు. మామిళ్లపల్లి నరసింహుడు .. మా ఇంటి నరసింహుడు అన్నట్టుగా గ్రామస్తులు ఆ స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. ఆయన చల్లని దయతోనే తామంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటున్నామంటూ అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News