ఇక్కడ స్వామి సేదదీరతాడట!

శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలతో .. నామాలతో కొండలపై కొలువుదీరుతుంటాడు. ఆ స్వామిని దర్శించుకునే భక్తులు, అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతుంటారు. అయితే భక్తులైనా .. అర్చకులైనా చీకటిపడిన తరువాత కొండదిగి వచ్చేస్తుంటారు. ఆ తరువాత ఆ కొండపై ఏంజరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వలన, కొన్ని విశేషాలు వెలుగు చూస్తుంటాయి.

అలాంటి విశేషం ఒకటి 'అనంతాద్రి'లో వినిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో సుభద్ర .. బలభద్ర .. జగన్నాథుడు, శ్రీదేవి .. భూదేవి సమేత శ్రీనివాసుడు స్వయంభువులుగా పూజలు అందుకుంటూ వుంటారు. పూర్వం ఇక్కడి జగన్నాథుడికి భక్తులు సమర్పించిన కానుకలు ఆయన సన్నిధిలోనే భద్రపరిచేవారు.

ఆ సొమ్ముకోసం ఒక రాత్రివేళ కొంతమంది దొంగలు స్వామివారి కొండపైకి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ విహరిస్తున్న స్వామివారిని ఎవరో భక్తుడనుకుని దొంగలు దాడి చేయడానికి ప్రయత్నించి శిలలుగా మారిపోయారు. ఆ శిలలను కూడా ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. ఈ కారణంగా ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నాడనీ, రాత్రి వేళలో స్వామి సేదదీరతాడని భక్తులు విశ్వసిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ఆయనని సేవిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News