బాధలు తీర్చే బంధువు బాబానే
మనసుకు కష్టం కలిగినా ... దుఃఖం కలిగినా 'బాబా'అని పిలవకుండా ఆయన భక్తులు ఉండలేరు. వాళ్లు పిలవడమంటూ జరిగితే రాకుండా ఆయన ఉండనూ లేడు. తండ్రి ఇచ్చే ధైర్యం .. తల్లిచూపే ఆదరణ బాబా సన్నిధిలో లభిస్తాయని ఆయన భక్తులు భావిస్తుంటారు. మనసుకి అవసరమైన శాంతి ఆయన దగ్గరే లభిస్తుందని విశ్వసిస్తుంటారు.
అందుకే గురువారం వచ్చిందంటే చాలు ఆయన ఆలయానికి వెళుతుంటారు. మంటపంలో ఎదురుగా కూర్చుని ఆయన వైపు చూస్తూ కన్నీళ్ల రూపంలో కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉంటారు. హారతులు పాడుతూ .. పారాయణాలు చేస్తూ .. భజనలు చేస్తూ ఆయన పట్ల తమకి గల భక్తిని చాటుకుంటూ ఉంటారు. బాబాని పల్లకిలో మోస్తూ ... పవళింపు సేవలో ఆయనని నిద్రపుచ్చుతూ పరవశించిపోతారు.
అలాంటి అనుభూతిని అందించే ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా 'చైతన్య నగర్' బాబా ఆలయం కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా .. బీఎన్ రెడ్డి నగర్ పరిధిలో గల ఈ కాలనీలో బాబా ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా దర్శనమిస్తూ ఉంటుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడి బాబా తన చల్లని చూపులతో హృదయాన్ని స్పర్శించి, తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇస్తాడు. వేలమంది బంధువులు ఒక్కరై వచ్చినట్టు ఓదార్పునిస్తాడు.
బాధలను తీర్చే బంధువు బాబానే అనీ .. ఆయనని నమ్మి సేవించినవారికి ఎలాంటి లోటు ఉండదని భక్తులు చెబుతుంటారు. బాబా అనుగ్రహం కారణంగా అనేక ఇబ్బందుల నుంచి .. ఆపదల నుంచి బయటపడిన వైనాన్ని అనుభవాలుగా ఆవిష్కరిస్తుంటారు. విశేషమైన రోజుల్లో ఆయన సేవకి మరింత సమయాన్ని కేటాయిస్తుంటారు .. ఆయన నామాన్ని స్మరిస్తూ .. పూజిస్తూ పునీతులవుతుంటారు.