కాలాన్ని వృథా చేయకూడదు

గడిచిన కాలం ... పోయిన ప్రాణం తిరిగిరావు. అందుకే గడుస్తోన్న కాలంతో పాటు పరిగెడుతూనే ప్రాణం పోయేలోగా పుణ్యరాశిని పెంచుకోవాలి. లేదంటే ప్రాణం పోయేముందు బాధపడవలసి వస్తుంది. ఆ బాధను చెప్పుకోవడానికిగానీ ... పంచుకోవడానికి గాని ఇక సమయం ఉండదు. అందుకే భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి.

ఆయన దర్శనానికి కొన్నిపనులు అడ్డుపడవచ్చునేమో గానీ, స్మరించుకోవడానికి అవరోధం ఏవుంటుంది? ఆయనకి ప్రత్యక్షంగా కానుకలు సమర్పించడానికి ధనం కావాలిగానీ, మానసికంగా సమర్పించడానికి పేదరికం ఎలా అడ్డుపడుతుంది? దైవకార్యాన్ని వాయిదావేసి, దేనిని సాకుగా చూపినా ఆయనకి తెలియనిది ఏవుంటుంది? అలా చేస్తే అది చూపునిచ్చినవాడి కళ్లను కప్పడానికి ప్రయత్నించడమే అవుతుంది.

వ్యాపారంలో భాగస్వాములు మోసం చేయవచ్చు. వ్యాధి బారిన పడిన క్షణంలో జీవిత భాగస్వామి సైతం దూరమైపోవచ్చు. నిస్సహాయ స్థితిలో నిలిచిపోయిన రోజున కన్నబిడ్డలు సైతం ఆ భారాన్ని మోయడానికి నిరాకరించవచ్చు. ఇందుకోసమా ఇంతగా కష్టాలు పడింది .. ఇలాంటివారి కోసమా పరమాత్ముడి సేవని పక్కన పెట్టిందనే పశ్చాత్తాపం కలగకపోదు. అప్పుడుపడే బాధకి ఇక ఉపశమనం లేదు.

కుటుంబం పట్ల బాధ్యతను నిర్వహిస్తూనే ఆ దేవదేవుడిని సేవించినట్లయితే, అందరూ వదిలేసిన క్షణాన ఆ స్వామి ఆత్మీయంగా చేయందిస్తాడు ... చేరదీస్తాడు. అప్పుడు అంతా వదిలేశారనే బాధ గుర్తుకు రాదు. దైవం చేరదీసిందనే ఆనందం మాత్రమే కలుగుతుంది. లౌకికమైన జీవితం నుంచి భయపడుతూ .. బాధపడుతూ కాకుండా, ఇష్టపడుతూ విముక్తిని పొందడం జరుగుతుంది. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు ... భగవంతుడి సేవలోనే దానిని ఎక్కువగా ఖర్చు చేయాలి.


More Bhakti News