హనుమజ్జయంతి నైవేద్యాలు ఇవే!
హనుమంతుడు అందరికీ దగ్గరివాడే ... ఎవరు ప్రేమతో పిలిచినా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పలికేవాడే. చదువుకున్నవాళ్లు హనుమంతుడు అంటూ ఆయనని కొలిచినా, జానపదులు హనుమన్నా అంటూ ఆప్యాయంగా పిలిచినా ఆయన కరిగిపోవడానికీ ... కదిలి రావడానికి ఎంతో సమయం పట్టదు. అలా ఆ ఆంజనేయుడు సీతారాముల అభిమానాన్నే కాదు, అశేష భక్తజనుల మనసులను సైతం దోచుకున్నాడు. మంచువంటి మనసున్న హనుమని ఉత్తరాదివారు .. దక్షిణాదివారు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు.
అయితే ఉత్తరాది భక్తులు స్వామి జయంతిని 'చైత్ర పౌర్ణమి' రోజున జరుపుతారు. దక్షిణాది ప్రాంతంలో చాలావరకూ 'వైశాఖ బహుళ దశమి' రోజున ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున హనుమంతుడి క్షేత్రాలను .. ఆలయాలను దర్శించి ప్రదక్షిణలు చేయాలి. సిందూర అభిషేకాలు .. ఆకుపూజలు జరిపించాలి. ఇక పిండి వంటలుగా వడలు .. తీపి పదార్థాలుగా బెల్లంతో చేయబడిన పొంగలి ... పండ్లలో ఆయనకి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.
స్వామి రూపాన్ని మనసున నిలుపుకుని సుందరకాండ .. హనుమాన్ చాలీసా పఠించాలి. ఈ విధంగా స్వామిని సేవించడం వలన, ఆయన ఎంతగానో ప్రీతిని చెందుతాడు. తన పాదాలను ఆశ్రయించిన భక్తులను దుష్టశక్తుల బారి నుంచి కాపాడతాడు. గత జన్మ పాపాలు .. తెలిసీ తెలియక చేసిన దోషాలను తొలగిస్తాడు. ఆపదలు కలగకుండా .. దారిద్ర్య బాధలు లేకుండా చూస్తాడు. శారీరక పరమైన .. మానసిక పరమైన వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అపమృత్యు దోషాల నుంచి బయటపడేసి ఆయుష్షును పెంచుతాడు.