నరసింహస్వామి ఆరాధనా ఫలితం!
భగవంతుడు ఉన్నాడా .. లేడా? ... భక్తుడు పిలిస్తే వస్తాడా .. రాడా? అనే సందేహాన్ని పటాపంచలు చేస్తూ శ్రీమహావిష్ణువు ధరించిన అవతారమే నరసింహ అవతారం. భగవంతుడు లేని చోటు లేదు అని హిరణ్యకశిపుడితో చెప్పాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? అంటూ దానిని 'గద'తో మోదాడు హిరణ్యకశిపుడు. భక్తుడి విశ్వాసాన్ని నిజం చేస్తూ, ఆ స్తంభం నుంచి వెలువడిన స్వామి ఆ రాక్షసరాజును సంహరిస్తాడు. ఈ సంఘటన 'వైశాఖ శుద్ధ చతుర్దశి' రోజున ప్రదోష వేళలో జరిగింది.
అందువలన ఈ రోజున నరసింహస్వామి జయంతిని భక్తులు జరుపుకుంటూ వుంటారు. ప్రదోష వేళలో ఆ స్వామిని సేవిస్తుంటారు. ఈ రోజున నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతుంటాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు. ఉపవాస దీక్షను చేపట్టి .. స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. స్వామి నామాన్ని స్మరిస్తూ .. కీర్తిస్తూ .. భజనలు చేస్తూ జాగరణ చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్తపాపాలు .. దోషాలు తొలగిపోతాయి. వాటి ఫలితంగా కలిగే ప్రమాదాలు ... వ్యాధులు నివారించబడతాయని స్పష్టం చేయబడుతోంది.