పెంచలకోనలో కొలువైన నృసింహుడు

వైశాఖమాసం శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం కావడం వలన, వైష్ణవ సంబంధమైన ఆయా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుపబడుతూ ఉంటాయి. ముఖ్యంగా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున సింహాద్రి అప్పన్నకి చందనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఆ తరువాత లక్ష్మీనృసింహస్వామికి చెందిన మరో విశిష్ట క్షేత్రం 'పెంచలకోన'లోను ఇదే వైశాఖాన శుద్ధ ద్వాదశి రోజు నుంచి అయిదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.

నేత్ర పర్వంగా జరిగే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీసంఖ్యలో తరలివస్తుంటారు. ఇక ఈ సందర్భంలో జరిగే 'గరుడ సేవ'లో పాల్గొనడానికి భక్తులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతారు. చెంచులక్ష్మీగా వచ్చిన లక్ష్మీదేవి స్వామివారిని పెనవేసుకున్న కారణంగాను .. పెనుశిలగా స్వామివారిమూర్తి దర్శనమిస్తూ ఉండటం వలన ఈ క్షేత్రానికి పెంచలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

స్వామివారు చెంచులక్ష్మిని పెళ్లిచేసుకోవడానికిగాను, చెంచులకి కన్యాశుల్కం చెల్లించవలసి వచ్చిందట. తన దర్శనార్థం వచ్చే భక్తులు చెల్లించే కానుకలతో ఆ సొమ్మును చెల్లిస్తానని స్వామి మాట ఇచ్చాడట. ఈ కారణంగా ఇక్కడి స్వామిని 'కొండి కాసులవాడు' గా పిలుస్తుంటారు. ఈ క్షేత్రం అనేక విశేషాలకు ... మహిమలకు నెలవుగా కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకోవడం వలన, దుష్టశక్తుల బారినుంచీ .. గ్రహసంబంధమైన దోషాల నుంచి .. పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పబడుతోంది. పెంచలకోన లక్ష్మీనృసింహస్వామినీ .. చెంచులక్ష్మీని దర్శించుకోవడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News