వైశాఖ శుద్ధ ఏకాదశి విశిష్టత!
శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం .. 'వైశాఖమాసం'. అనేక పుణ్యవిశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే వైశాఖశుద్ధ ఏకాదశి కూడా ఎంతో విశేషాన్నీ .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ విశేషం కారణంగానే ఈ రోజున 'అన్నవరం'లోని సత్యనారాయణస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. మోహినీ ఏకాదశిగా పిలవబడే ఈ రోజున చేసే విష్ణు ఆరాధన అనంతమైన పుణ్యఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడే సమస్యలు సతమతం చేస్తుంటాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ మానసికశాంతికి దూరం చేస్తుంటాయి. ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మ పాపాల ఫలితంగా జరుగుతూ వుంటాయి. అలాంటి పాపాల బారి నుంచి బయటపడి, పుణ్యరాశిని పెంచుకునేదిగా ఏకాదశి వ్రతం కనిపిస్తుంది. ఆ పుణ్యరాశి కారణంగా ఉత్తమగతులు కలిగేలా చేస్తుంది.
అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ .. స్తోత్రాలు పఠిస్తూ .. కీర్తనలు ఆలపిస్తూ .. పారాయణాలు చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. జాగరణతో స్వామిని సేవించాలి. ఈ విధంగా చేయడం వలన సంపదలు .. సంతోషాలే కాదు, మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.