వైశాఖ శుద్ధ సప్తమి ప్రత్యేకత

శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనదిగా వైశాఖమాసం చెప్పబడుతోంది. వైశాఖంలో శుద్ధ సప్తమి అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఈ సప్తమిని 'గంగా సప్తమి'అనీ .. 'నింబసప్తమి'అనీ .. 'కమలాసప్తమి'అని అంటూ ఉంటారు. భగీరథుని ప్రయత్నం కారణంగా భూమిమీదకి వచ్చిన గంగ, ఉత్సాహంతో పరుగులు తీస్తూ జహ్నుమహర్షి ఆగ్రహానికి గురవుతుంది. గంగను మింగిన ఆయన, భగీరథుని ప్రార్ధనకి శాంతించి తిరిగి తన చెవినుంచి వదులుతాడు. అలా గంగాదేవి జన్మించిన రోజు గంగాసప్తమిగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆ తల్లిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

ఇక ఈ రోజున వేపచేట్టును పూజించి, దాని ఆకులను కొద్దిగా స్వీకరించాలని అంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ ఇలా వేపచేట్టును పూజించే సప్తమి కనుక దీనిని నింబ సప్తమిగా పిలుస్తుంటారు. ఇదే రోజుని కమలా సప్తమిగా పరిగణిస్తుంటారు. ఈ రోజున కమలంలో సూర్యభగవానుడి ప్రతిమను వుంచి .. వ్రత నియమాలను పాటిస్తూ పూజించి .. బ్రాహ్మణులకు వాటిని దానంగా ఇవ్వాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే ఇది కమలా సప్తమిగా పిలవబడుతోంది. ఇలా ఈ సప్తమి రోజున గంగాదేవిని పూజించడం వలన .. వేప వృక్షానికి నమస్కరించడం వలన .. సూర్య భగవానుడిని ఆరాధించడం వలన సమస్త పాపాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News