ఆదిశంకరాచార్యులవారి జయంతి
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థను సుసంపన్నం చేసిన మహానుభావులలో ఆదిశంకరులవారు ముందు వరుసలో కనిపిస్తాడు. బాల్యంలోనే తల్లి అనుమతి తీసుకుని సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన ఆయన, భక్తి .. జ్ఞాన .. వైరాగ్యాలను గురించిన బోధనలు చేస్తూ, హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతమైన స్థాయిలో ప్రచారం చేస్తూ అనేక ప్రాంతాలను దర్శించాడు. భగవద్గీత .. ఉపనిషత్తులు .. విష్ణు సహస్రనామం .. బ్రహ్మ సూత్రాలకు ఆయన భాష్యం రాశాడు.
సౌందర్యలహరి ... శివానందలహరితో పదసముదాయాన్ని స్వీకరించడంలోను, శబ్ద సౌందర్యాన్ని తీసుకురావడంలోను తన ప్రత్యేకతను కనబరిచాడు. శివకేశవుల పట్ల ఆరాధనా భావాన్ని ఆవిష్కరిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేశాడు. ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడటం కోసం పీఠాలను ఏర్పాటుచేశాడు. 'కనకధారాస్తవం' తో లక్ష్మీదేవిని మెప్పించి, ఒక పేదరాలికి దారిద్ర్యం నుంచి విముక్తిని కలిగించాడు. స్పర్శమాత్రం చేత ఒక కుష్ఠురోగికి ఆ వ్యాధి నుంచి విముక్తిని కల్పించాడు.
నర్మదా నది వరద పోటెత్తి వస్తుంటే, ఆ ప్రవాహ వేగాన్ని ఒక కడవలో బంధించి అక్కడి ప్రజలను రక్షించాడు. అలాంటి శంకరులవారు 'వైశాఖ శుద్ధ పంచమి' రోజున జన్మించారు. ఆయన జన్మతిథిని 'శంకర జయంతి' గా జరుపుకుంటూ ఉంటారు. సాక్షాత్తు శివ స్వరూపుడిగా చెప్పబడుతోన్న ఆ మహానుభావుడిని ఈ రోజున స్మరించుకోవడం వలన ... పూజించడం వలన ... ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వలన విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయని చెప్పబడుతోంది.