సోమలింగేశ్వరుడిని దర్శించుకుంటే చాలు!

సదాశివుడి లీలావిశేషాలకు నిలయాలుగా ఆయన క్షేత్రాలు కనిపిస్తుంటాయి. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడి విశేషాలను తెలుసుకుని భక్తులు పరవశించి పోతుంటారు. మహేశ్వరుడి మహిమలను గురించి చెప్పుకుని తరిస్తుంటారు. అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని అందించే క్షేత్రంగా 'బాన్స్ వాడ' దర్శనమిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో గల ఈ క్షేత్రం ప్రముఖ శైవక్షేత్రంగా విలసిల్లుతోంది.

ఈ ప్రాంతంలో గల ప్రాచీన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. శివుడు ఇక్కడ 'సోమలింగేశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఇక్కడి శంకరుడు స్వయంభువు కావడం విశేషం. దేవతలు స్వామివారిని ఆరాధించారనీ .. మహర్షులు సేవించారని .. మహాభక్తులు పూజించారని చెబుతుంటారు. కాకతీయుల కాలంలో స్వామివారి ఆలయం నిర్మించబడిందని అంటారు.

కాకతీయుల కాలంలో శివాలయాల నిర్మాణం పెద్దసంఖ్యలో జరిగింది. అంతకు పూర్వమున్న శివాలయాల పునరుద్ధరణ కూడా వాళ్లు అదే స్థాయిలో చేశారు. అలాగే ఇక్కడి స్వామివారి ఆలయం అభివృద్ధికి నోచుకుందని చెబుతారు. ఇక్కడి శివుడు చూపే మహిమలు ... కోనేరు నీటికి గల విశిష్టతను గురించి అనేక కథనాలు వినిపిస్తుంటాయి. స్వామి లీలావిశేషాలను భక్తులు తమ అనుభవాలుగా చెబుతుంటారు.

ఆయన సన్నిధిలో నిలబడి అంకితభావంతో అడగాలేగాని, అమ్మలా కరిగిపోయి అడిగినవి ప్రసాదిస్తాడని భక్తులు చెబుతుంటారు. ఆయన చల్లనిచూపుతో కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు చేరువవుతాయని అంటారు. అసలు ఆయన దర్శనంతో దక్కని పుణ్య విశేషం లేదని చెబుతారు. విశేషమైన పుణ్యతిథుల్లో ఆయన సేవకిగాను మరింత సమయాన్ని కేటాయిస్తుంటారు. తమని కనిపెట్టుకుని ఉంటోన్న ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వుంటారు.


More Bhakti News