అక్షయమైన ఫలితాలనిచ్చే ధాన్య దానం
సాధారణంగా ఏదైనా ఒక ముఖ్యమైన కార్యాన్ని ఆరంభించాలని అనుకున్నప్పుడు, మంచిరోజు ... మంచి ముహూర్తం చూస్తుంటారు. ఆ ముహూర్త కాలంలో ఆయా కార్యాలను ఆరంభించడం వలన , ఎలాంటి ఆటంకాలు లేకుండా అవి విజయవంతంగా పూర్తవుతాయని భావిస్తుంటారు. అయితే వారం .. వర్జ్యం చూడనవసరం లేకుండా ముఖ్యమైన కార్యాలను ఆరంభించే రోజుగా 'అక్షయ తృతీయ' చెప్పబడుతోంది. వైశాఖ శుద్ధ తదియ .. అక్షయ తృతీయగా చెప్పబడుతోంది.
ఈ రోజున ఏ పని చేసినా అది అక్షయమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున అంతా పుణ్యఫలితాలను పొందాలనీ .. ఏదో ఒక రూపంలో ధనం ఇంటికి చేరాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన మాసం ... అందునా 'అక్షయ తృతీయ' అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అందువలన ఈ రోజున లక్ష్మీనారాయణులను షోడశ ఉపచారాలతో పూజించవలసి వుంటుంది.
అంతేకాకుండా ఈ రోజున దానం చేయడం వలన వచ్చే పుణ్యఫలితం కూడా అక్షయంగా పెరుగుతుంది గనుక, మంచినీళ్లతో పాటు అనేక వస్తువులను దానంగా ఇస్తుంటారు. ఇక ధాన్యం విషయానికి వస్తే ఈ రోజున గోధుమలు ... శనగలు దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. దానం భక్తి శ్రద్ధలతోను .. ప్రీతితోను చేయాలి. అహంభావంతోను .. అసహనంతోను చేసే దానం వలన ఎలాంటి ఫలితం వుండదు. భగవంతుడు తనద్వారా మరొకరికి అందేలా చేస్తున్నాడనే భావనతోనే దానం చేయాలి. ఆ విధంగా చేసే దానం వలన, సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.