దుర్గాదేవి ఆరాధనతో దుఃఖం నశిస్తుంది
దుర్గతులను తొలగించేదిగా దుర్గాదేవి చెప్పబడుతోంది. ఆ తల్లిని పూజిస్తూ వుండటం వలన దారిద్ర్యం ... దుఃఖం దూరమవుతాయి. లోకకల్యాణం కోసం ఆదిపరాశక్తి ధరించిన రూపాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. ఆదిపరాశక్తి పరిపూర్ణమైన శక్తి ఈ రూపంలో దర్శనమిస్తుంది. ఆ తల్లి శక్తికి ఎదురులేదు ... ఆమె అనుగ్రహానికి తిరుగులేదు.
తన బిడ్డల వంటి భక్తులను ఆదుకోవడం కోసం ఆమె అనేక ప్రదేశాల్లో కొలువుదీరింది. ఆ ప్రదేశాలన్నీ కూడా శక్తి క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. మహిమాన్వితమైన క్షేత్రాలుగా అలరారుతున్నాయి. అమ్మవారి అనుగ్రహముంటే దుష్టశక్తుల బారి నుంచి విముక్తి కలుగుతుంది. సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయి. ఆ తల్లి చల్లని ఆశీస్సులు తీసుకుని, ఆమె పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని వుంచి ఆరంభించిన పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమవుతాయి.
అందుకే దుర్గమ్మతల్లి దర్శనానికీ .. అంకితభావంతో ఆమెని సేవించడానికి మహిళా భక్తులు ఆరాటపడుతుంటారు. ఆ తల్లికి చీరసారెలు సమర్పిస్తూ వుంటారు. ఇక అమ్మవారిని పూజించడం వలన రాహు గ్రహ సంబంధమైన దోషం కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పబడుతోంది. రాహు గ్రహ సంబంధమైన దోషంతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు, అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ ఆలయ ప్రదక్షిణలు చేయడం వలన ... ఆ తల్లికి పూజాభిషేకాలు జరిపించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.