అక్షయతృతీయ రోజున లక్ష్మీ ఆరాధన

ఎవరైనా అందంగా కళకళలాడుతూ కనిపిస్తే లక్ష్మీకళ ఉట్టిపడుతోందని అంటూ వుంటాం. ఎవరింటికైనా వెళితే ఆ ఇల్లు పద్దతిగా ... సంప్రదాయబద్ధంగా కనిపిస్తే, అది లక్ష్మీనివాసంలా శోభాయమానంగా వుందని అనుకుంటూ వుంటాం. అంటే లక్ష్మీదేవి ఎక్కడైతే వుంటుందో అక్కడ కళ వుంటుంది ... శోభ వుంటుంది. సంపద ఉన్నదీ .. లేనిదీ ఈ కళ చెప్పేస్తూ వుంటుంది.

అలాంటి కళను పొందాలంటే ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం ప్రయత్నించాలి. అమ్మవారికి ఇష్టమైన ధర్మమార్గంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ, పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ వుండాలి. అహంభావాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక భావాలను అలవరచుకోవాలి. ఇక ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన 'అక్షయ తృతీయ' రోజున భక్తిశ్రద్ధలతో పూజించాలి.

ఈ రోజున చేసిన పూజ .. పుణ్యం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. ధర్మబద్ధమైన మార్గంలో గడించిన సంపద అక్షయంగా పెరుగుతుందని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని అంకితభావంతో పూజించడం .. అనంతమైన విశ్వాసంతో సేవించడం .. ఆ తల్లి ఆలయాలను దర్శించి పూజాభిషేకాలు జరిపించడం మరచిపోకూడదు. దైవాన్ని విశ్వసించినవారికీ .. సేవాగుణాన్ని కలిగినవారికి ఎలాంటి లోటు రాకుండా లక్ష్మీదేవి కటాక్షిస్తూనే వుంటుంది.


More Bhakti News