అక్షయ తృతీయన చేయవలసిన దానం

వైశాఖమాసంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నదిగా 'అక్షయ తృతీయ' కనిపిస్తుంది. అక్షయమంటే నశింపులేనిది అనే అర్థం. తరిగిపోనిది ఏదైనా పెరుగుతూనే వుంటుంది. అందువలన ఈ రోజున ఏదికొన్నా అది అలా పెరుగుతూ వుంటుందని భావిస్తుంటారు. సంపదలు తరిగిపోకుండా ఉండాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటూ వుంటారు గనుక, ఈ రోజున 'బంగారం' ను ఎంతో కొంత కొనుగోలు చేస్తుంటారు. అందువలన అది వృద్ధి చెందుతుందని విశ్వసిస్తుంటారు.

ఇక ఈ రోజున చేసే దానం కూడా అక్షయమై జన్మజన్మల పాటు వెంటవస్తుందని చెప్పబడుతోంది. వైశాఖమాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుంది. అందువలన అందరికీ ఎక్కువగా దాహం అవుతూ వుంటుంది. కొన్ని పరిస్థితుల్లో .. కొన్ని ప్రదేశాల్లో దాహం తీర్చుకునే అవకాశం వుండదు. అలాంటివారి దాహాన్ని తీర్చాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున వీలైనంత మందికి మంచినీటిని దానం చేయాలి. అలాగే మంచినీరు కోసం పశువులు .. పక్షులు .. జంతువులు కూడా అలమటిస్తూ వుంటాయి. వాటి దాహం తీర్చే ఏర్పాట్లు చేయడం కూడా ఎంతోమంచిది. ఇలా ఈ రోజున మంచినీటి దానం చేయడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. ఏ జన్మ ఎత్తినా అప్పుడు మంచినీటి కోసం ఆరాటపడే పరిస్థితి రాదని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News