వైశాఖంలో ఆచరించవలసిన నియమాలు
నారాయణ అనే నామం వినిపించగానే వైకుంఠంలో పాలసముద్రంలో శేషతల్పంపై ఆశీనుడైన ఆ స్వామి రూపం కనులముందు కదలాడుతుంది. ఆ స్వామి ఆలయాలకి వెళ్లి ఆయనకి నమస్కరిస్తూ వున్నప్పుడు, ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహాభక్తులు .. ఆ స్వామి పాదాలను సేవించారో కదా అనే ఆలోచన కలుగుతుంది. బ్రహ్మ కడిగిన ఆ పాదాలు ఈ భూలోకంలోను నడయాడాయి కదా అనిపిస్తుంది. అలాంటి పాదాలను సేవించడంకన్నా భాగ్యం ఏవుంటుందనిపిస్తుంది.
లోకకల్యాణ కారకుడైన ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రసాదించే మాసంగా 'వైశాఖమాసం' చెప్పబడుతోంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు భూలోక సంచారం చేస్తూ ఉంటాడని అంటారు. అందువలన సమస్త దేవతలు ఇక్కడి జలాశయాల్లో స్నానమాచరించి ఆ స్వామిని సేవిస్తూ ఉంటారని చెబుతారు. ఈ కారణంగా ఈ మాసంలో చేసే నదీస్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. నదీస్నానంతో పాటు ఈ మాసంలో ఆచరించవలసినవిగా కొన్ని నియమాలు చెప్పబడుతున్నాయి.
ఈ మాసంలో వేడినీటితో స్నానం చేయకూడదు ... అలాగే తలంటుకో కూడదు. పులుపు .. ఉప్పు .. కారం తగ్గించి శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుండాలి. నదీస్నానం చేసిన తరువాత వైష్ణవ సంబంధమైన దేవాలయాలను దర్శించాలి. ఉపవాస దీక్షను చేపట్టి స్వామిని భక్తిశ్రద్ధలతో సేవించాలి. ఆ తరువాత శక్తి కొద్దీ దానం చేయాలి. ఈ మాసమంతా ఈ విధమైన నియమాలను పాటిస్తూ ఆ పరంధాముడిని పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు చేకూరతయనీ ... ఉత్తమగతులు కలుగుతాయని చెప్పబడుతోంది.