మాటతప్పని మహారాజులు

ఏ విషయంలోనైనా మాట తప్పకుండా జీవితాన్ని కొనసాగించడం అంతతేలిక కాదు. ధర్మం తప్పకుండా అన్నమాటను నిలబెట్టుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. ధర్మబద్ధమైన అలాంటి నియమాన్ని పాటించి జనం గుండెల్లో నిలిచిపోయిన మహారాజులు ఎంతోమంది వున్నారు.

రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి, వాలిని సంహరించి ఆ రాజ్యానికి అతణ్ణి రాజుని చేస్తాడు. ఇక విభీషణుడికి ఇచ్చిన మాట మేరకు లంకానగరానికి రాజుగా అతనికి పట్టాభిషేకం జరిపిస్తాడు. నలమహారాజు దిక్పాలకులకు ఇచ్చిన మాటకి కట్టుబడి, తాను మనసుపడిన దమయంతి దగ్గరికి వెళ్లి దిక్పాలకులలో ఎవరో ఒకరిని వివాహమాడమని చెబుతాడు.

దిలీప మహారాజు వశిష్ఠ మహర్షికి ఇచ్చిన మాటకి కట్టుబడి, ఆయన గోవుని పులి బారి నుంచి రక్షించడానికిగాను తన ప్రాణాలను పణంగా పెడతాడు. ఇక విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని ఆయనకి ధారాదత్తం చేస్తాడు. ఆ మాట కోసమే ఆయన తన భార్యను దాసీగా అమ్మకానికి పెడతాడు. ఆ మాట కోసమే తాను కాటికాపరిగా అమ్ముడుపోతాడు. మాటకి కట్టుబడే కాటిసుంకం చెల్లించకుండా కన్నబిడ్డను ఖననం చేయడానికి నిరాకరిస్తాడు.

మాటకి ఆ మహారాజులు ఇచ్చిన విలువ ... గౌరవం అలాంటిది. మాట సత్య సంబంధమైనదిగా ... దాని ఆచరణ ధర్మ సంబంధమైనదిగా వాళ్లు భావించారు. సత్య ధర్మాలను రెండుకళ్లుగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. అందుకే ఆదర్శమూర్తులుగా నేటికీ వాళ్లు కొనియాడబడుతున్నారు. మంచి మనసులందు నిలిచి పూజించబడుతున్నారు.


More Bhakti News