కుజదోష ప్రభావం ఇలా తగ్గుతుంది
ఎక్కువమందిని కలవరపరిచే గ్రహసంబంధమైన దోషాలలో 'కుజదోషం' ఒకటి. కుజ దోషం తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఈ దోషం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలా అని ఆలోచన చేస్తుంటారు. భార్యాభర్తలతోసహా అయిన వాళ్లతోను మనస్పర్థలు వచ్చేలాచేసి, మనశ్శాంతి లేకుండా చేయడం కుజదోష జాతకులలో కనిపిస్తూ వుంటుంది.
అవమానాలు ఎదురుకావడం ... ఆరోపణలను ఎదుర్కోవడం ఎక్కువగా వుంటుంది. వివాహం విషయంలో ఆలస్యం ... ఒకవేళ అయితే వైవాహిక జీవితంలో సంతోషమనేది లేకుండాపోవడం ఈ దోషం వలన జరుగుతూ వుంటుంది. ఎవరి జీవితమైనా బంధాలకు ... అనుబంధాలకు కట్టుబడి కొనసాగుతూ వుంటుంది. అలాంటి బంధాలనే దెబ్బతీస్తుంది కనుక, కుజ దోషం అనగానే డీలాపడిపోతుంటారు.
కుజ దోషం నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తుంటారు. అలాంటివాటిలో ఒకటిగా 'సుబ్రహ్మణ్యస్వామి' ఆరాధన కనిపిస్తుంది. కుజుడికి అధిష్ఠాన దేవతగా సుబ్రహ్మణ్యస్వామి వ్యవహరిస్తుంటాడు. కుజుడిని మంగళుడు అని కూడా పిలుస్తుంటారు. అందువలన మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కుజుడు ప్రసన్నుడవుతాడు. కుజుడు శాంతిస్తే ఆయన ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గుతుంది. ఆ దోషాల ఫలితంగా పడుతూ వస్తోన్న ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది.