వైశాఖ మాసంలో చేయవలసిన దానం
శ్రీమహావిష్ణువు స్థితికారకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. లోకంలోని సమస్థితికి ఎవరి వలన ఎలాంటి భంగం కలగకుండా చూస్తుంటాడు. ఆ స్థితికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నం జరిగినప్పుడల్లా ఆయన వివిధ అవతారాలను ... రూపాలను ధరిస్తూ వచ్చాడు. సాధు సజ్జనులను కాపాడుతూ వచ్చాడు. అందువలన ఆ నారాయణుడిని దేవతలు ... మహర్షులు ... మహాభక్తులు కీర్తిస్తూ వుంటారు.
ఆ స్వామి అనుగ్రహాన్ని అందించేవిగా కొన్ని పర్వదినాలు కనిపిస్తూ వుంటాయి. ఇక మాసమంతా ఆయన సేవాభాగ్యం వలన విశేషమైన ఫలితాలను ఇచ్చేదిగా 'వైశాఖ మాసం' కనిపిస్తుంది. చాంద్రమానం ప్రకారం ద్వితీయ మాసంగా చెప్పబడుతోన్న వైశాఖం, అనేక విశేషాల సమాహారమైన పవిత్రమాసంగా కనిపిస్తూ వుంటుంది. ఈ మాసంలో ఎక్కడ చూసినా శుభకార్యాల సందడి దర్శనమిస్తూ వుంటుంది.
ఇక శ్రీమన్నారాయణుడికి ఇది ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతూ వుండటం వలన, ఆయన కటాక్షాన్ని కోరుతూ భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. ఈ మాసంలో లభించే నదీస్నాన ఫలితం .. పూజా ఫలితం .. దానఫలితం విశేషంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన నదీస్నానం చేసి .. వైష్ణవ క్షేత్రాలను దర్శించవలసి వుంటుంది. ఆ స్వామిని అంకితభావంతో అర్చించవలసి వుంటుంది.
ఇక ఈ మాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుంది కనుక, పాదరక్షలు .. గొడుగు .. విసనకర్రలు దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. అలాగే ఈ మాసంలో లభించే మామిడి ఫలాలను దేవాలయాలకి తీసుకువెళ్లి, అక్కడి స్వామికి నివేదన చేశాక భక్తులకు పంచిపెట్టాలి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహంతో అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయనీ, సకలశుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.