నైవేద్యాన్ని ఆరగించిన భగవంతుడు
భగవంతుడిని అందరూ పూజిస్తూ వుంటారు ... ఆయనకి ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యాలుగా సమర్పిస్తుంటారు. భగవంతుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించినట్టుగా విశ్వసించడం జరుగుతుందేగానీ, ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆరగించినట్టు కనిపించదు. కానీ కొంతమంది బాలభక్తులు పట్టుపట్టడంతో ఆయన నేరుగా వచ్చి నైవేద్యాలను ఆరగించక తప్పలేదు.
బాలభక్తుల పట్ల భగవంతుడికి అమితమైన వాత్సల్యం ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. 'నామదేవుడు' పాండురంగస్వామికి మహాభక్తుడు. బాలకుడిగా వున్న ఆయన ఒకసారి విఠలుడికి నైవేద్యాన్ని తీసుకువెళతాడు. భగవంతుడు నిజంగానే నైవేద్యం స్వీకరిస్తాడని అనుకున్న ఆ బాలకుడు, ఆయన రాకపోవడంతో వచ్చేంతవరకూ అక్కడి నుంచి కదలనంటూ అక్కడే కూర్చుండిపోతాడు.
పసివాడి భక్తికి మురిసిపోయిన స్వామి, ప్రత్యక్షంగా వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించి వెళతాడు. అలా బాల్యంలోనే నామదేవుడికి ఆ పాండురంగడి ప్రత్యక్ష దర్శనం లభించింది. ఇక వేంకటనాథుడు (రాఘవేంద్రస్వామి) బాలకుడిగా వున్నప్పుడు, తండ్రి పురమాయించడంతో కృష్ణుడికి నైవేద్యం తీసుకుని ఆలయానికి వెళతాడు. ఆ నైవేద్యాన్ని తినడానికి ఆయన వస్తాడని అనుకుంటాడు. ఎంతకీ రాకపోవడంతో తండ్రి తనని కొడతాడని భావించి భయపడతాడు.
వచ్చి నైవేద్యాన్ని ఆరగించమని పలువిధాలుగా ప్రాధేయపడతాడు. దాంతో ఆ స్వామి నేరుగా వచ్చి వేంకటనాథుడికి దర్శనమిచ్చి నైవేద్యాన్ని స్వీకరించి వెళతాడు. ఇలా పరమాత్ముడు బాలభక్తుల పసిమనసును అర్థంచేసుకుని వాళ్ల మనసులో గల బలమైన విశ్వాసానికి సంతోషించి అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అవి స్వామి చల్లని మనసుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి.