అహంభావమే అడ్డుగోడ !
చాలామంది ఉదయాన్నే పూజామందిరం దగ్గర కూర్చుని దేవుడికి పూజ చేస్తుంటారు. అలాగే పర్వదినాల్లో ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. అవకాశాన్నిబట్టి పుణ్యకార్యాల్లో పాల్గొంటూ వుంటారు. అయితే ఇలాంటివారిలో కొంతమంది, నేను దానం చేశాను ... నేను విరాళం ఇచ్చాను ... ఈ దైవకార్యాన్ని నేను ముందుండి నడిపించడం వలన వైభవంగా జరిగిందని చెప్పుకుంటూ వుంటారు.
అలాంటివారు ఏదో ఒక సందర్భంలో భగవంతుడిని ఏదో ఒకటి కోరుతుంటారు. అది నెరవేరకపోతే ఆశ్చర్యపోతుంటారు. ఇంతగా మంచిపనులు చేసినా భగవంతుడు ఎందుకు అనుగ్రహించడం లేదని సందేహానికి లోనవుతుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఒకసారి ఒక ఆధ్యాత్మిక గురువుని దర్శించుకుంటాడు. తాను ఎన్నో దానధర్మాలు చేశాననీ .. ఎవరు ఏ సాయాన్ని కోరి వచ్చినా తాను చేశానని చెబుతాడు.
తమ ఊళ్లో ఏ దైవకార్యం జరిగినా తానే ముందుంటానని అంటాడు. ఫలానా చోటున గుడి కట్టించాననీ .. గోపురం కట్టించానని చెబుతాడు. తాను ఎంతో భక్తుడినని అంతా అంటూ ఉంటారనీ, అయినా తాను ఆశించిన పనులు ఎందుకు జరగడం లేదనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఇన్నిచేసినా భగవంతుడి అనుగ్రహాన్ని ఎందుకు పొందలేకపోతున్నానని అడుగుతాడు.
అతని మాటతీరును బట్టి ఆ ఆధ్యాత్మిక గురువుకి విషయం అర్థమైపోతుంది. అతను మంచిపనులే చేసినప్పటికీ పొగడ్తల వలన అహంభావం తలెత్తిందనీ, ఆ అహంభావమే భగవంతుడి సన్నిధికి చేరుకోవడానికి అడ్డుగోడగా నిలుస్తుందని చెబుతాడు. కాబట్టి 'నేను' అనే ఆ అడ్డుగోడను కూల్చేయడం తప్ప, భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి మరోమార్గం లేదని స్పష్టం చేస్తాడు.
భగవంతుడు సర్వానికీ యజమానీ, అందరినీ ... అన్నింటినీ నడిపించేవాడు ఆయనే. ఆయా పనులను ఆయన తమకి కేటాయించాడని అనుకోవాలే గానీ, తామే చేస్తున్నామనే భావన రానీయవద్దని అంటాడు. తాము నిమిత్తమాత్రులమనే విషయాన్ని ఎవరైతే మరిచిపోకుండా ఆ భగవంతుడిని సేవిస్తూ వుంటారో, వాళ్లకి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుందని చెబుతాడు. అజ్ఞానం తొలగిపోవడంతో గురువుకి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు.