దైవం ఎవరికి రక్షణగా నిలుస్తుంది ?
తోటమాలి ఆ తోటని ఎవరూ పాడుచేయకుండా ... అందులోని పూలను ఎవరూ కోయకుండా ఎంతో జాగ్రత్తగా కాపలాకాస్తూ వుంటాడు. ప్రతి పువ్వును ఆయన కంటికిరెప్పలా కాపాడుతూ వుంటాడు. భగవంతుడు కూడా ఆ తోటమాలి మాదిరిగానే తన భక్తులను రక్షిస్తూ వుంటాడు. తన భక్తులకు ఎవరు ఎలాంటి హానితలపెట్టినా ఆయన ఎంతమాత్రం సహించడు.
ఇందుకు ఉదాహరణగా ప్రహ్లాదుడు .. అంబరీషుడు .. పోతన .. కబీరుదాసు ... తులసీదాసు ... తుకారామ్ తదితరుల జీవితాల్లోని సంఘటనలు కనిపిస్తుంటాయి. పాండురంగడి భక్తుడైన తుకారామ్ విషయానికే వస్తే, ఆయనపై వచ్చిన నిందారోపణ శివాజీ మహారాజుకి బాధకలిగిస్తుంది. ఆయన నిర్దోషి అనే విషయాన్ని స్పష్టం చేయడం కోసం శివాజీ ఒంటరిగా ఆ గ్రామానికి వెళతాడు.
ఈ విషయం శత్రువులకు తెలిసి వాళ్లు శివాజీని బంధించడం కోసం ఆ గ్రామాన్ని చుట్టుముడతారు. అయితే తన భక్తుడికి అనుకూలంగా తీర్పు చెప్పడం కోసం వచ్చిన శివాజీని కాపాడవలసిన బాధ్యతను సాక్షాత్తు ఆ పాండురంగాడే తీసుకుంటాడు. శివాజీ వేషధారణలో శత్రువులను తరిమికొడతాడు. అలా శివాజీ మహారాజు ఆ ప్రమాదం నుంచి రక్షించబడతాడు.
ఇక ఎవరైతే తుకారామ్ ని ఆ గ్రామం నుంచి సాగనంపాలని ఆ పన్నాగం పన్నుతారో వాళ్లు భగవంతుడి చేత శిక్షించబడతారు. తన భక్తులను అభిమానించేవారిని సైతం భగవంతుడు కాపాడుతూ ఉంటాడనీ, వాళ్లని బాధించడానికి ప్రయత్నించినవాళ్లని శిక్షిస్తూ ఉంటాడనడానికి నిదర్శనంగా ఈ సంఘటన కనిపిస్తూ వుంటుంది. భక్తులపట్ల భగవంతుడికి గల ప్రేమానురాగాలను అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.