భగవంతుడిని రప్పించే శక్తి అదే !

ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు ఆరాధిస్తూ వుంటారు. మరికొందరు తాము విశ్వసించిన దైవాన్ని అదేపనిగా సేవిస్తుంటారు. భగవంతుడికి సమర్పించకుండా వీళ్లు మంచినీళ్లు కూడా స్వీకరించరు. ఒకవైపున వీళ్లు దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూనే, దైవారాధనచేస్తూ వుంటారు. అలాంటి భక్తికి పరవశించిన భగవంతుడు వారి ఇంటికి రాకుండా ఎలా ఉండగలడు ?

అలా శివపార్వతులు అతిథులుగా మారువేషాల్లో చిరుతొండనంబి ఇంటికి వస్తారు. ఆయన భార్యాబిడ్డల భక్తిశ్రద్ధలను సైతం పరీక్షించి పరవశించిపోతారు. అడిగిన విధంగా వాళ్లు ఇచ్చిన ఆథిత్యానికి సంతోషించి, ప్రత్యక్ష దర్శనంతో అనుగ్రహించి వెళతారు. ఇక త్యాగయ్య తన కృతులతో రాముడిని అభిషేకిస్తూ ఉండేవాడు. రాముడిని కీర్తించడంలో కలిగే ఆనందానికి మరేదీ సాటిరాదని ఆయన విశ్వసించేవాడు.

అలాంటి ఆ భక్తుడి ఇంటికి కూడా సీతారాములు అతిథులుగానే వస్తారు. అడిగిమరీ ఆయనచే కీర్తనలు పాడించుకుని ముగ్ధులవుతారు. శ్రీరాముడి పాదసేవ చేసుకునే భాగ్యం తప్ప ఆయన మరేదీ కోరుకోవడం లేదని తెలుసుకుని ఆనందాశ్చర్యాలకి లోనవుతారు. ఆయనకి ఆనందాన్ని కలిగించేలా ... మనోభీష్టం నెరవేరేలా కటాక్షిస్తారు. ఇక శ్రీకృష్ణుడు కూడా సక్కుబాయి భక్తికి మురిసిపోయి ఆమె ఇంటికి వచ్చేసిన వైనం అద్భుతమనిపిస్తుంది.

అసమానమైన భక్తి భగవంతుడిని ఇంటికి రప్పించగలదనడానికి ఈ సంఘటన మరోమారు నిదర్శనంగా నిలుస్తుంది. సక్కుబాయి చిరకాల కోరికను నెరవేర్చిన స్వామి, కొన్ని కారణాల వలన అక్కడ చిక్కుబడిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో రుక్మిణీ దేవి కూడా అక్కడికి రావలసి వస్తుంది. ఇలా ఆ ఇల్లు రుక్మిణీ శ్రీకృష్ణుల పాదస్పర్శచే పునీతమవుతుంది. సక్కుబాయి జీవితం ధన్యమవుతుంది. ఇలా ఎంతోమంది భక్తులు భగవంతుడి మనసు గెలుచుకున్నారు. ఆ దైవాన్ని రప్పించగలిగే సాధనం నిజమైన .. నిస్వార్థమైన .. నిర్మలమైన భక్తేనని చాటిచెప్పారు.


More Bhakti News