ఈ రోజున ఆదిదేవుడిని ఆరాధించాలి
మనస్ఫూర్తిగా శివయ్యా అని పిలిస్తే ఆయన కరిగిపోవడానికీ ... కదిలిరావడానికి ఎక్కువసేపు పట్టదు. పాపాల ఫలితాలు వెంటాడుతున్నప్పుడు ... కష్టనష్టాలు సతమతం చేస్తున్నప్పుడు ఎవరికీ కూడా మనశ్శాంతి వుండదు. శారీరకంగా ... మానసికంగా కూడా కుంగిపోవడం జరుగుతూ వుంటుంది. ఇలా సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వాటి బారినుంచి విముక్తిని కలిగించేదిగా శివనామస్మరణ కనిపిస్తుంది.
అన్నిరకాల బాధలకు అసలైన విరుగుడుగా ఆయన ఆరాధన పనిచేస్తుంది. అందువల్లనే దేవతలు ... మహర్షులు ... మహాభక్తులు ఆయనని అంకితభావంతో సేవించి తరించారు. ఆ స్వామిని అనునిత్యం పూజించే భక్తులు ఎంతోమంది వున్నారు. ఇక ప్రతిరోజు ఆయనని పూజించుకోవాలనివున్నా అందుకు అవకాశం లేని వాళ్లూ వున్నారు.
అలాంటి భక్తులకు ఆ దేవదేవుడు కల్పించిన మహదావకాశంగా 'మాసశివరాత్రి' కనిపిస్తుంది. ఈ రోజున పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన మాసమంతా ఆయనని సేవించిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సదాశివుడికి ప్రదోష సమయం (సాయంకాలం) ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. అందువలన ఈ రోజున ఆ సర్వేశ్వరుడికి సాయంకాల సమయంలో అభిషేకం జరిపి .. బిల్వదళాలతో అర్చించాలి.
పగటిపూట ఉపవాసం ... రాత్రి జాగారం ఈ రోజు నియమంగా కనిపిస్తుంది. పూజామందిరంలో స్వామిని పూజించినా ఆలయం దర్శనం చేయడం కూడా మంచిది. ఈ రోజంతా సదాశివుడిని మనసులో నిలుపుకుని ఆయన నామాన్ని స్మరిస్తూ ... ఆయన లీలావిశేషాలని కీర్తిస్తూ ... భజనల ద్వారా ఆయనకి మరింతగా చేరువయ్యే ప్రయత్నం చేస్తూ జాగరణ పూర్తిచేయవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా దోషాలు తొలగిపోతాయి. పుణ్యఫలాలు ప్రాప్తించడం వలన సకలశుభాలు చేకూరతాయి.