అభయాన్నిచ్చే ఆంజనేయుడు

ఆంజనేయుడు ఎంతటి బలసంపన్నుడో ... ఎంతటి వీరుడో అంతటి సున్నితమైన మనసున్నవాడు. పర్వతం వంటి ఆకారాన్ని కలిగినా .. వేడి తగిలితే వెన్న కరిగి పోయినట్టుగా, ఎదుటివారి కష్టాన్ని చూస్తే చాలు ఆయన చలించిపోతుంటాడు. అందువల్లనే రాముడి ఆవేదన తీర్చడం కోసం ఆయన అన్ని కష్టాలను పడ్డాడు. సీతమ్మకి సంతోషాన్ని కలిగించడం కోసం మంచిమాటలు చెప్పాడు.

రామ .. రావణ సంగ్రామం పూర్తయిన తరువాత కూడా ఆయన ఎక్కడా తన గొప్పతనాన్ని గురించిన ప్రస్తావన చేయలేదు. తాను శ్రీరామచంద్రుడి సేవకుడననీ ... ఆయన నామానికి గల శక్తే తనని ముందుకి నడిపించిందని చెప్పిన వినయశీలి. అలా తాను రాముడి పాదాలను సేవిస్తూనే, తన పాదాలను ఆశ్రయించిన భక్తులను కంటికిరెప్పలా కాపాడుకుంటూ రావడం ఆంజనేయుడి ప్రత్యేకతగా కనిపిస్తూ వుంటుంది.

అలాంటి ఆంజనేయుడు అనేక ప్రాంతాల్లో కొలువై భక్తులచే విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. అలాంటి ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - ఎల్బీ నగర్ సమీపంలో గల 'ఎన్టీఆర్ నగర్' లో కనిపిస్తుంది. ప్రధాన రహదారికి దగ్గరలోనే ఈ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. చాలాకాలం నుంచి ఇక్కడ 'అభయాంజనేయుడు' పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

మంగళవారాల్లోను ... విశేషమైన పర్వదినాల్లోను స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. స్వామివారి దీక్షను చేపట్టే భక్తులు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు. ఎలాంటి కష్టంలోనైనా ఇక్కడి అభయాంజనేయుడి పాదాలను ఆశ్రయిస్తే, ఆయన అండదండలు తప్పక లభిస్తాయని చెబుతుంటారు. భక్తుల కష్టనష్టాలను తీర్చడంలో స్వామివారు ఎంతమాత్రం ఆలస్యం చేయరని అంటారు. ఇక హనుమజ్జయంతి రోజున ఇక్కడి వాళ్లంతా తప్పనిసరిగా ఆయన దర్శనం చేసుకోవడం విశేషం.


More Bhakti News