శివాలయ ప్రదక్షిణ ఫలితం !
సమస్త జీవులకు పరమశివుడు ఆహారాన్ని అందిస్తూ వుంటాడు. అలాగే తన భక్తులందరి యోగక్షేమాలను పర్యవేక్షిస్తూ అందరి దగ్గరికి ఆయన తిరుగుతూనే వుంటాడు. మనసారా మహేశ్వరుడిని స్మరించుకోవాలేగానీ, పరిగెత్తుకు రాకుండా ఆయన ఉండలేడు ... అనుగ్రహించకుండా ఆగలేడు. దేవతలు .. మహర్షులు ... మహారాజులు ... సాధారణ మానవులకే కాదు, క్రిమికీటకాలకు కూడా తన సాన్నిధ్యాన్ని ప్రసాదించినవాడాయన.
చల్లచిలికితే వెన్నవస్తుందనేది ఎంత సత్యమో, పరమశివుడి పాదాలను పట్టుకోవడం వలన పాపాలు నశిస్తాయనేది ... దోషాలు దూరమవుతయనేది అంతసత్యం. అలాంటి సదాశివుడిని ప్రార్ధించడం వలన, గురుగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఎవరైనా విద్య వల్లనే జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానమే వాళ్లని ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. విద్యవల్లనే సిరిసంపదలు ... పేరు ప్రతిష్ఠలు చేకూరతాయి.
అలాంటి విద్యలో ఆశించిన విజయాలను సాధించకుండా గురుగ్రహ సంబంధమైన దోషం అడ్డుపడుతూ వుంటుంది. అలాంటి దోష ప్రభావాన్ని తగ్గించేవాడుగా సదాశివుడు చెప్పబడుతున్నాడు. గురుగ్రహానికి అధిష్ఠాన దేవత సదాశివుడు. అందువలన ఆయన ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన ... పూజాభిషేకాలు జరిపించడం వలన గురువు ప్రసన్నుడవుతాడు. గురుగ్రహ సంబంధమైన దోషం నుంచి బయటపడాలనుకునే వాళ్లు, పరమశివుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.