క్షేత్రదర్శన ఫలితం అలా లభిస్తుంది

సాధారణంగా వీలునుబట్టి కుటుంబ సభ్యులతోను, లేదంటే ఇరుగుపొరుగువారితోను కలిసి పుణ్యక్షేత్రాలకి వెళుతూ వుండటం జరుగుతుంది. ఏ క్షేత్రానికి వెళ్లినా ముందుగా అక్కడి తీర్థంలో స్నానం ఆచరిస్తూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన శరీరం పరిశుభ్రమవుతుంది. ఆలయంలోకి అడుగుపెట్టడానికి అవసరమైన అర్హత లభిస్తుంది. అయితే శరీరంతో పాటు మనసు కూడా పవిత్రంగా ఉండాలంటే దైవసంబంధమైన ఆలోచనలతో కల్మషాలను కడిగేయాలి.

ఏ క్షేత్రంలోవున్నా అక్కడి స్వామిని గురించే ఆలోచనచేస్తూ వుండాలి. అక్కడి స్థలమహాత్మ్యం .. స్వామి లీలావిశేషాలను గురించి తెలుసుకోవాలి. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సత్సంగాల్లో పాల్గొనాలి. భగవంతుడి రూపాన్ని మనోఫలకంపై నిలుపుకుని ధ్యానం చేయాలి. ఆయన గురించి తెలిసిన కీర్తనలు ... పాటలు పాడుకోవాలి.

ఇలా భగవంతుడి సన్నిధానంలో ఉన్నంతవరకూ ఆయన స్మరణలో ... సేవలో తరించాలే తప్ప, ఇతర ఆలోచనలు చేయకూడదు. వాళ్లాలా ... వీళ్లిలా అని ఎవరో గురించిన కాలక్షేపపు కబుర్లు చెప్పుకోకూడదు. ఇతరులలోని గర్వం ... అసూయ భావం గురించి చర్చించకూడదు. తాము ఇటు రావడం వలన ఇంటి దగ్గర అన్ని పనులూ సక్రమంగా జరుగుతున్నాయో లేదో అనే ఆందోళనతో వుండకూడదు. దాని వలన భగవంతుడి పాదాలపై దృష్టి పెట్టలేకపోతారు.

శారీరకంగా ప్రయాణం చేయడం వలన క్షేత్రానికి చేరుకోగలుగుతారేగానీ, భగవంతుడి సన్నిధికి చేరువకావాలంటే చిత్తశుద్ధి తప్పనిసరి. అదిలేకపోతే క్షేత్రదర్శనం వలన పరిపూర్ణమైన ఫలితం లభించకుండా పోతుంది. అందువలన ఏ క్షేత్రానికి వెళ్లినా సాధ్యమైనంత వరకూ ఇతర విషయాలను గురించిన ఆలోచనలు చేయకుండా చూసుకోవాలి. భగవంతుడి సేవలో .. స్మరణలో .. ఆరాధనలో ... ఆలాపనలో పరవశించిపోవాలి. అప్పుడే క్షేత్రదర్శనం ఫలితం పరిపూర్ణంగా దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News