పాపాల నుంచి విముక్తిని కలిగించే ఏకాదశి
జీవితం అనేక ఒడిదుడుకులతో కొనసాగుతూ వుంటుంది. ఎన్నోకష్టాలు ... సమస్యలు అతలాకుతలం చేస్తుంటాయి. అనారోగ్య సమస్యలు ... ఆర్ధికపరమైన సమస్యలు ... అనుకోని ఆపదలు సతమతం చేస్తుంటాయి. ఏ పనులు ఆరంభించినా అవి అర్ధాంతరంగా ఆగిపోతుంటాయి ... తీవ్రమైన నిరాశా నిస్పృహలను కలిగిస్తుంటాయి.
పూర్వజన్మలో చేసుకున్న పాపాల ఫలితంగా ... కొందరి శాపాల కారణంగా ఇలా జరుగుతూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ పాపాల ఫలితాలు ... వాటి తాలూకు దోషాలు అన్ని విషయాలయందు అడ్డుపడుతూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే, పాపాలను నశింపజేసుకోవడమే మార్గం.
అలాంటి మార్గంగా 'చైత్ర బహుళ ఏకాదశి' చెప్పబడుతోంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పాపాలు పటాపంచలు అవుతాయి కనుక, దీనిని 'పాపవిమోచన ఏకాదశి' గా పిలుస్తుంటారు. ఎంతోమంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాపాల నుంచి .. శాపాల నుంచి బయటపడినట్టుగా చెప్పబడుతోంది. అందువలన ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి శ్రీమన్నారాయణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది.
స్వామివారి నామస్మరణ చేస్తూ .. భజనలు చేస్తూ ... ఆయన లీలావిశేషాలను గానం చేస్తూ జాగరణ చేయవలసి వుంటుంది. ఈ విధంగా ఈ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడిని నియమనిష్టలతో ... భక్తి శ్రద్ధలతో సేవించడం వలన పాపాలు తొలగిపోయి పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.