శివలీలా విశేషాలు తలచుకున్నాచాలు
శివలీలలను తలచుకుంటే చాలు ... పాపాల కూపంలో నుంచి బయటపడటం జరుగుతుంది. ఆయన క్షేత్రాలలోని విశేషాలను గురించి చెప్పుకుంటే చాలు, పుణ్యఫలాలు చేతికి అందుతాయి. భక్తుల కోరిక మేరకు ... వాళ్లని అనుగ్రహించడం కొరకే సదాశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో ప్రాచీన కాలానికి చెందిన స్వయంభువు క్షేత్రాలు అనేక ప్రాంతాల్లో విలసిల్లుతున్నాయి.
కొండలపైన .. గుహల్లోనూ .. నదీ తీరాల్లోను ... సొరంగ మార్గాల్లోను .. ఇలా తాను లేని ప్రదేశం లేదన్నట్టుగా ఆ స్వామి కొలువుదీరి కనిపిస్తుంటాడు. అలా ఆయన కొలువైన ప్రతి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని దర్శనమిస్తుంది. ఆయా క్షేత్రాల్లో గల ఆ విశేషాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. మరింత శ్రద్ధతో వాళ్లు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి.
ఒక క్షేత్రంలో శివలింగ శిరోభాగం నుంచి నీరు ఊరుతూ వుంటుంది ... మరో క్షేత్రంలో శివలింగపాద భాగం నుంచి అదేపనిగా నీరు వస్తూ వుంటుంది. ఇక ఒక క్షేత్రంలో అభిషేక జలం గర్భాలయంలో నుంచి బయటికి రాకుండా లోపలే ఇంకిపోతుంది ... మరో క్షేత్రంలో ఒక సమయం ప్రకారం అప్పుడప్పుడు గర్భాలయంలోకి నీరు ప్రవేశిస్తూ వుంటుంది.
ఇక ఎప్పుడూ కొంతవరకూ నీటిలో వుండే శివలింగాలు .. నిదానంగా పెరుగుతూ వుండే శివలింగాలు గల క్షేత్రాలు కూడా లేకపోలేదు. ఇలా ఎలా జరుగుతుందో ... ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతుబట్టదు. అందువల్లనే ఇలాంటి విశేషాలను ఆ శివయ్య లీలలుగానే భక్తులు చెప్పుకుంటూ వుంటారు. మహేశ్వరుడు చూపే మహిమలుగా కొనియాడుతుంటారు. ఆ పరమశివుడిని పూజించి పునీతులవుతుంటారు.