దారిద్ర్యాన్ని తొలగించే శివపూజ
సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనరోజు. సోమ అంటే .. స+ఉమ .. ఉమతో కూడినవాడు అనే అర్థం చెప్పబడుతోంది. శివుడు శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు ... పార్వతీదేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ వుంటుంది. అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
సోమవారం వచ్చిందంటే చాలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటాయి. ఈ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఇక కొంతమంది ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావలసినది అంకితభావమే. చిత్తశుద్ధితో పూజించాలేగాని ఆయన అనుగ్రహించనిది లేదు.
మహేశ్వరుడికి జరిపే షోడశ ఉపచారాలలో ఒక్కో ఉపచారం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది. ఎలాంటి లోపం లేకుండా ప్రతి ఉపచారాన్ని జరపాలి. అలాంటి ఉపచారాలలో మరింత విశేషాన్ని కలిగినదిగా 'నైవేద్యం' కనిపిస్తుంది. సదాశివుడికి వివిధరకాల పండ్లను ... గారెలు - బూరెలు వంటి పిండివంటలను ... పాయసం వంటి తీపిపదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి.
ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ 'లేమి' అనే మాట వినిపించదని చెప్పబడుతోంది. అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్తపాపాలు పటాపంచలై పోవడమే కాకుండా, సంపదలు ... సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.