కృష్ణుడి లీలావిశేషం అలాంటిది !
శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కృష్ణావతారం మరింత విశేషాన్నీ ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ అవతారంలో నారాయణుడు చూపిన లీలలు అన్నీఇన్నీకావు. ఆ లీలావిశేషాలను తలచుకుంటే చాలు జన్మధన్యమైపోతుంది. గోవుల పోషణ చూస్తూ .. గోపాలకులతో ఆడుతూ .. గోపికలను ఆటపట్టిస్తూ వచ్చిన ఆయన, భక్తుల విషయంలోనూ అద్భుతమైన లీలావిశేషాలను ఆవిష్కరించాడు.
తన భక్తులకు ఆనందాన్ని కలిగించడం కోసం పరమాత్ముడు పసివాడిగా చూపిన లీలలు, తలచుకున్నప్పుడల్లా తరింపజేస్తూనే వుంటాయి. స్వామి తిరువనంతపురంలో అనంతపద్మనాభుడుగా అవతరించడానికి ముందు, బాలకృష్ణుడిగా 'దివాకరముని' అనే భక్తుడి ఇంట అల్లరి చేశాడు. పరమాత్ముడిని పసివాడిగా చూసుకోవాలనే ఆయన కోరికను నెరవేర్చాడు.
ఇక మీరాబాయి మధురభక్తికి స్వామి మురిసిపోయేవాడు. ఆమె భజన కొనసాగుతూ ఉండగానే, ఆయన చిరుగాలిలా వచ్చి పలకరించి అంతలోనే అదృశ్యమవుతూ ఉండేవాడట. అలా మీరాబాయి కృష్ణుడిని సేవిస్తూనే ఆయనలో ఐక్యమైపోయింది. ఇక జయదేవుడుతో 'అష్టపదులు' పలికించడం కోసం రాధతో కలిసి ఆయన అనేక లీలావిశేషాలను ఆవిష్కరించాడు. ఒకానొక సమయంలో మృతి చెందిన జయదేవుడి భార్యను బతికించి, భక్తుడిపట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు.
తన భక్తురాలైన సక్కుబాయి కష్టాలను తీర్చడం కోసం ఆమె రూపంలో ఆ కుటుంబసభ్యులకు సేవలు చేశాడు. చూపుకోల్పోయిన సూరదాస్ చేయిపట్టుకుని నడిపించాడు .. చెంతనే వుంటూ సేవలు చేశాడు. ఇలా భక్తుల కోసం ... వాళ్లకి సంతోషాన్ని కలిగిచడం కోసం కృష్ణుడు చూపిన లీలలు మనసు వేదికపై కమనీయమైన దృశ్యాలుగా కదులుతూనే వుంటాయి ... మురిపిస్తూ ముచ్చట తీరుస్తూనే వుంటాయి.